గత ఏడాది విడుదలైన కేజిఎఫ్ సంచనాలు ఎంత చెప్పినా తక్కువే. ఎటువంటి ఆర్బాటంగా లేకుండా విడుదలైన కేజిఎఫ్ చిత్రం అన్ని భాషలలో రికార్డు వసూళ్లు సాధించి ఘనవిజయం నమోదు చేసింది. ఈ ఒక్క చిత్రంతో హీరో యష్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అంతగా కేజిఎఫ్ సినీ అభిమానుల మన్నలను అందుకుంది.

ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా కేజిఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం అందించిన విజయం స్పూర్తితో కేజిఎఫ్ 2 చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల ఈ చిత్ర షూటింగ్ కి తాత్కాలిక బ్రేక్ పడింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో గల సైనైడ్ హిల్స్ ప్రాంతంలో చిత్రీకరణ నేపథ్యంలో అక్కడి పర్యావరణం హాని కలుగుతుందని ఒకరు పిటీషన్ దాఖలు చేశారు. దీనికి స్పందించిన కోర్ట్ ఆ ప్రాంతంలో చిత్రీకరణ నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఐతే తాజాగా కేజిఎఫ్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుందని సంచారం. కేజిఎఫ్ చిత్ర తాజా షెడ్యూల్ ని దర్శకుడు హైదరాబాద్ లో చిత్రీకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. హీరో యష్ పై కొన్ని కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో చిత్రీకరించే అవకాశం కలదు.