ఒక హీరో చెయ్యాల్సిన సినిమాను వేరొక హీరో చేయడం చూస్తుంటాం. అలాంటి ఘటనే తాజాగా ఒకటి జరిగిందని పరిశ్రమలో వినిపిస్తోంది. హీరో రవితేజ, ఆర్‌.ఎక్స్‌. 100 చిత్రం పేమ్‌ దర్శకుడు అజయ్‌ భూపతిల కలయికలో మహా సముద్రం పేరుతో ఓ చిత్రం తెరకెక్కబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం డిస్కోరాజా చిత్రంతో బిజీగా ఉన్న రవితేజ ఆ తర్వాత  చేయబోయే చిత్రాలలో మహా సముద్రం ఒకటని కొద్దిరోజులుగా ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం మహా సముద్రం చిత్రాన్ని రవితేజ చేయడం లేదన్న వార్త హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై చిత్ర పరిశ్రమలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఆర్‌.ఎక్స్‌. 100 చిత్రం ఘన విజయం తర్వాత అజయ్‌ భూపతికి మంచి క్రేజ్‌ లభించిన విషయం తెలిసిందే. దాంతో ఆయన మహా సముద్రం కథను సిద్దం చేసుకుని తొలుత నాగచైతన్యతో సినిమా చేయాలనుకున్నారట. అయితే అప్పట్లో మజిలీ చిత్రంతోనూ, అలాగే తదుపరి ప్రాజెక్టులతో నాగచైతన్య బిజీగా ఉండటంతో అజయ్‌ భూపతి వెంటనే రవితేజను కలిశారట. రవితేజకు తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు కూడా చేశారట. అయితే కారణాలేంటో తెలియవు కానీ తాజాగా రవితేజ ఈ ప్రాజెక్టు చేయడం లేదన్న మాటలు పరిశ్రమలో వినిపిస్తున్నాయి.
దాంతో మళ్లి నాగచైతన్య దగ్గరకే మహాసముద్రం ప్రాజెక్టు వెళ్లిందట. నాగచైతన్య కోసం తొలుత తాను తయారు చేసుకున్న కథనే నాగచైతన్యకు వినిపించాలని అజయ్‌భూపతి నిర్ణయించుకున్నట్లు పరిశ్రమలో చెప్పుకుం టున్నారు. ప్రస్తుతం నాగచైతన్య వెంకీమామ చిత్రంతో పాటు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏదిఏమైనా త్వరలోనే మహాసముద్రం చిత్రంపై మరింత స్పష్టమైన సమాచారం తెలిసే అవకాశం ఉంది.