రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నిరవధికంగా జరుపుతున్నారు. ఇటీవలే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కొరకు ఆర్ ఆర్ ఆర్ యూనిట్ బల్గెరియా వెళ్లడం జరిగింది. కాగా కొద్దిరోజులుగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై ఒక వార్త ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తుంది. అదేమిటంటే వచ్చే నెల 22న ఉద్యమ వీరుడు కొమరం భీం జయంతి నేపథ్యంలో ఎన్టీఆర్ కొమరం భీం లుక్ ని విడుదల చేస్తారట.

వీటిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో ఈ వార్తలను నమ్మే పరిస్థితి లేదు. గతంలో కూడా ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్, చరణ్ ల ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారంటూ అన్నీ మీడియా మాధ్యమాలలో ప్రచారం చేయడం జరిగింది. కానీ ఆరోజు ఆర్ ఆర్ ఆర్ నుండి ఎటువంటి కీలక అప్డేట్ రాలేదు. మరి ఈసారి కూడా ఈ వార్త నిజమౌతుంది అని చెప్పలేం, అలాగని కొట్టిపారేయలేం.

ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ఇంకా దాదాపు 11నెలల సమయం మాత్రమే ఉంది కాబట్టి రాజమౌళి ప్రచార జోరు పెంచొచ్చు. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో అదేస్థాయి వసూళ్లు రాబట్టాలంటే మూవీకి ప్రచారం అనేది చాలా అవసరం. బాహుబలి విషయంలో రాజమౌళి ఐదేళ్లు ఎదో ఒక వార్తతో ప్రేక్షకులలో ఉండేలా చూసి, భారీ వసూళ్లు సాధించారు.