నటుడు మురళి శర్మ టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు. ఆయన టాలీవుడ్ దర్శక నిర్మాతల మొదటి ఛాయస్ అవుతున్నారు. గత రెండేళ్లుగా మురళి శర్మ దాదాపు అన్ని సినిమాలలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల తండ్రి పాత్రలలో ఎక్కువగా కనిపిస్తున్నారు.

మురళి శర్మ టాలీవుడ్ కి మహేష్ నటించిన అతిథి చిత్రంతో పరిచయమయ్యారు. ఆ తరువాత ఎన్టీఆర్ కంత్రి, ఊసరవెల్లి చిత్రాలలో నటించారు. ఐతే 2015లో వచ్చిన భలే భలే మగాడివోయ్ ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అలాగే ఆ తదుపరి ఏడాది వచ్చిన కృష్ణగాడి వీర ప్రేమ గాధ లో కూడా ఆయన సీరియస్ విలన్ గెటప్ లో కామెడీ పండించారు.

ఇక ఆయన హిందీ కంటే కూడా తెలుగులోనే ఎక్కువ చిత్రాలు చేస్తున్నారు. ఈ ఏడాది సాహో, నిను వీడని నీడని నేను వంటి చిత్రాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలలో నటించారు. దీంతో ప్రకాష్ రాజ్ ప్లేస్ ని ఆయన భర్తీ చేస్తున్నారనిపిస్తుంది.

ఒకప్పుడు ప్రకాష్ రాజ్ ఇలానే వరుస పెట్టి తెలుగులో సినిమాలు చేసేవారు. కారణాలేమైనా ఆయన చిత్రాలలో నటించడం తగ్గించారు. దీనితో ఆ అవకాశాలన్నీ మురళి శర్మ దగ్గరకు వస్తున్నాయి. బేసిక్ గా హిందీ వాడైన మురళి శర్మ చక్కగా తెలుగు మాట్లాడగలరు. అది కూడా ఆయనకు అవకాశాలు రావడంలో ఒక కారణం.