విడుదల తేదీ : సెప్టెంబరు 06, 2019


నటీనటులు : తరుణ్ తేజ్,లావణ్య,కేదార్ శంకర్,అజయ్ ఘోష్.

దర్శకత్వం : నవీన్ నాయని.

నిర్మాత‌లు : డాక్టర్ లింగేశ్వర్

సంగీతం : సాబు వర్గేశ్.

నూతన నటీనటులు తరుణ్ తేజ్ మరియు లావణ్యలు హీరో హీరోయిన్లుగా నవీన్ నాయని దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ మరియు ఎమోషనల్ డ్రామా “ఉండిపోరాదే” ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి. 

కథ : 

రాజమండ్రి ప్రాతంలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి కేదార్ శంకర్ తన కూతురు హర్షిత(లావణ్య) ను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు.అయితే పరిస్థితుల రీత్యా పై చదువులు కోసం హైదరాబాద్ కు పంపుతారు.అలాగే అక్కడే కరీంనగర్ కు చెందిన ఒక పేద కుటుంబానికి చెందిన కుర్రాడు హీరో రామ్(తరుణ్ తేజ్).ఈ ఇద్దరు ఒకే కాలేజీలో చేరి ప్రేమలో పడతారు.తెలిసీ తెలీని వయసులో వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ చివరకు సక్సెస్ అయ్యిందా?ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు?ఈ క్రమంలో హర్షితకు ఏమయ్యింది?ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే. 

ప్లస్ పాయింట్స్ : 

ఈ సినిమాలోని ముఖ్యమైన ప్లస్ పాయింట్ చెప్పాలి అంటే సినిమాలో కథానుసారం వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్ మరియు తండ్రి కూతుర్ల మధ్య నడిచే ప్రతీ సన్నివేశం ఆకట్టుకుంటుంది.తండ్రీ కూతుర్ల మధ్య ఉండే బంధాన్ని చిత్రీకరిస్తూ ఎన్ని సన్నివేశాలు చూసినా సరే మనసుకు దగ్గరగానే అనిపిస్తాయి.అలాంటి సన్నివేశాలు ఈ చిత్రంలో చాలానే ఉంటాయి.ముఖ్యంగా ఈ రెండు పాత్రల్లో నటించిన లావణ్య మరియు కేదార్ శంకర్ లు అయితే అద్భుత నటన కనబర్చారు.హీరోయిన్ కూడా తన క్యూట్ లుక్స్ సహా మంచి నటనతో ఆకట్టుకుంది.

అంతేకాకుండా ఫస్టాఫ్ లోని “పటాస్” ఫేమ్ నూకరాజు సహా అక్కడక్కడా వచ్చే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.ఈ చిత్రంలోని మరో సీనియర్ నటుడు అజయ్ ఘోష్ కూడా తన పాత్ర పరిధి మేరకు మంచి నటన కనబర్చారు.హీరో రామ్ మరియు లావణ్యాల మధ్య నడిచే లవ్ ట్రాక్ సన్నివేశాలు కాలేజ్ లైఫ్ ను చూసిన ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉంటుంది.అంతేకాకుండా టీనేజ్ లో ఉన్నటువంటి పిల్లలు ప్రేమలో పడితే వాటి వల్ల తల్లితండ్రులు పడే బాధలను,సమాజంలో వారు ఎదుర్కొనే ఇబ్బందులను దర్శకుడు చక్కగా ఎలివేట్ చేసారు. 

మైనస్ పాయింట్స్ : 

అసలు ఈ సినిమా మొదలైన చాలా సేపటి వరకు అసలు కథ ఏమిటి అన్నది చూసే ప్రేక్షకుడికి అర్ధం కాదు.దానికి తోడు సాగదీతగా సాగే ఫస్టాఫ్ విసుగు తెప్పిస్తుంది.అంతేకాకుండా ఈ సినిమాలో చూపించే కాలేజ్ ఎపిసోడ్స్ సహా ప్రధాన పాత్రధారుల మధ్య లవ్ ట్రాక్ ను ఇది వరకే ఎన్నో సినిమాల్లో చూసెయ్యడం వల్ల పెద్ద గొప్పగా అనిపించకపోవచ్చు.

తండ్రి కూతుర్ల మధ్య ట్రాక్ అను ఆసక్తికరంగా మలచిన దర్శకుడు లవ్ ట్రాక్ ను కాలేజ్ ఎపిసోడ్స్ ను రొటీన్ గా కాకుండా ఆసక్తికరంగా తెరకెక్కిస్తే బాగుణ్ణు.అంతే కాకుండా ఈ సినిమా లాజిక్ లెస్ సీన్లు కూడా అధికంగానే ఉన్నాయి.వీటి వల్ల ప్రేక్షకుడికి సినిమాపై అంత ఆసక్తి కలగదు.అలాగే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేవారికి క్లైమాక్స్ బాగుంటుంది అనిపించినా కాస్త లాజికల్ గా ఆలోచిస్తే మాత్రం క్లైమాక్స్ ఎపిసోడ్ అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించలేకపోవచ్చు.

 

సాంకేతిక విభాగం :

 

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం నవీన్ నాయని అందించగా లింగేశ్వర్ కథను అందించారు.అయితే లింగేశ్వర్ అందించిన కథ పరంగా ఎమోషనల్ టచ్ బాగున్నా చాలా అవకతవకలు ఉన్నాయి.వీటిని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించి ఉంటే ఇంకా బాగుండేది.అలాగే సాబు వర్గేశ్ అందించిన ఒక్క పాట మినహా మిగతా పాటలు పర్వాలేదనిపిస్తాయి.అలాగే యాలేందర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంది.సినిమా కోసం లింగేశ్వర్ అందించిన నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

 

తీర్పు :

లవ్ మరియు ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఉండిపోరాదే చిత్రం సింపుల్ లవ్ ట్రాక్ ను ఇష్టపడే వారికి అలాగే ఎమోషనల్ పరంగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యినా బలహీనమైన కథా, కథనాలు లాజిక్ లేని సన్నివేశాలు తీవ్ర నిరాశ పరుస్తాయి.మొత్తంగా ఈ చిత్రం గట్టెక్కడం కష్టమే అని చెప్పాలి.