ప్రేక్షకులకు నచ్చే పాటలు, ఫైట్స్‌, మదర్‌ సెంటిమెంట్‌ వంటి అన్ని అంశాలు మార్షల్‌ చిత్రంలో ఉన్నాయని…విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తుందన్న నమ్మకం తమకు ఉందని చిత్ర హీరో, నిర్మాత అభయ్‌ అన్నారు. అభయ్‌, మేఘాచౌదరి జంటగా రాజాసింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అభయ్‌ మాట్లాడుతూ, ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించాం. చాలాబాగా వచ్చింది. నేను బాగా నటించడానికి నటుడు శ్రీకాంత్‌గారు ఎంతో సపోర్ట్‌ చేశారు. ఆయనకు, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయి. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా ఎప్పుడొచ్చినా ఆదరిస్తారు. ఈ కోవలోనే ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని అన్నారు. సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌ మాట్లాడుతూ, ఈ సినిమా ద్వారా అభయ్‌ తెలుగు తెరకు పరిచయం కానుండటం ఆనందంగా ఉంది. తను మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నాను. హీరోగానే కాకుండా అతను ఈ సినిమాతో నిర్మాతగా ఒక అడుగు ముందుకు వేయడం అభినందనీయం. నిన్నే ఈ చిత్రాన్ని చూశాను. నేను ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో ఇది చాలా మంచి చిత్రం అని అన్నారు. దర్శకుడు జయరాజ్‌సింగ్‌ మాట్లాడుతూ, కథ వినగానే ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మించేందుకు అభయ్‌ ముందుకొచ్చారు. నన్ను నమ్మి ఈ చిత్రాన్ని ఒప్పుకున్న శ్రీకాంత్‌గారికి ధన్యవాదాలు. కొత్త పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం అని చెప్పారు. అతిథిగా పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, మొదటి సినిమాతోనే అభయ్‌ కొత్త కాన్సెప్ట్‌తో రాబోవడం అభినందనీయం. భవిష్యత్‌లో అతను నటుడిగా మరో మెట్టు ఎక్కాలని కోరుకుంటున్నాను అని అన్నారు. గీత రచయిత వరికుప్పల యాదగిరి మాట్లాడుతూ, ఈ సినిమాలో రాసిన పాటలకు మంచి స్పందన లభిస్తోందని అన్నారు. సంగీత దర్శకుడు రవి బర్సుర్‌ మాట్లాడుతూ, కేజీఎఫ్‌ చిత్రం తర్వాత తాను అంగీకరించిన సినిమా ఇదేనని, కథ నచ్చిన వెంటనే సినిమా చెయ్యడానికి అంగీకరించానని చెప్పారు. దర్శకుడు ఓ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అని పేర్కొనగా….ఈ సినిమాలో తన పాత్ర అందరికీ నచ్చుతుందని హీరోయిన్‌ మేఘాచౌదరి అన్నారు. అభయ్‌తో కలిసి నటించడం మంచి జ్ఞాపకంగా నిలిచిందని ఆమె అన్నారు.