మణిరత్నం దర్శకత్వంలోని సినిమాలకు ఒకప్పుడు ఇళయరాజా సంగీతం సమకూర్చేవారు. అయితే ‘రోజా’ సినిమాలో ఏఆర్‌ రెహ్మాన్‌ను పరిచయం చేసి.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనతోనే ప్రయాణం చేస్తున్నారు మణి. తన మెడ్రాస్‌ టాకీస్‌ నిర్మాణ సంస్థలో తెరకెక్కే సినిమాల్లో మాత్రం ఇతర సంగీత దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ఇదిలా ఉండగా తన శిష్యుడు ధనశేఖరన్‌ దర్శకత్వంలో ‘వానం కొట్టట్టుం’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో సిద్‌ శ్రీరాం సంగీత దర్శకుడిగా పరిచయం కానున్నారు. తమిళంలో ‘ఎన్నోడు నీ ఇరుందాల్‌’ (ఐ), ‘కురుంబా కురుంబా..’ (టిక్‌ టిక్‌ టిక్‌), ‘కన్నాన కన్నే..’ (విశ్వాసం) వంటి పాటలతో అందర్నీ ఆకట్టుకున్నారు సిద్‌ శ్రీరాం. తెలుగులో ‘ఉండిపోరాదే..’ వంటి పలు హిట్‌ పాటలతో యువతను ఆకట్టుకున్నారు. ఏఆర్‌ రెహ్మాన్‌ నుంచి అనిరుధ్‌ వరకు పలువురి సంగీతంలో పాటలు పాడారు. ఇప్పుడు మణిరత్నం నిర్మాణంలోని చిత్రంతో ఆయన సంగీత దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించనున్నారు. విక్రంప్రభు, ఐశ్వర్యా రాజేష్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిరత్నం కథ, మాటలు రాయడం విశేషం.