మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు, అనిల్‌ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం రామోజీ ఫిలింసిటీలో జరుపుతున్న భారీ షెడ్యూల్‌ పూర్తయినట్లు తెలిసింది. కర్నూలు నేపథ్యానికి చెందిన కొండారెడ్డి బురుజు సెట్‌ను ఫిలింసిటీలో ప్రత్యేకంగా నిర్మించి…అందులో ఇంటర్వెల్‌ సన్నివేశాలను భారీగా చిత్రీకరించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఓ ఫైట్‌ను కూడా చిత్రీకరించారు. దీంతో ఫిలింసిటీ షెడ్యూల్‌ పూర్తయిందని అంటున్నారు. ఆర్మీ మేజర్‌ పాత్రలో మహేష్‌బాబు ఈ చిత్రంలో నటిస్తుండటంతో కథానుసారం కాశ్మీర్‌లో మొదటి షెడ్యూల్‌ను జరిపారు. ఆ తరువాత ఫిలింసిటీలో మరో షెడ్యూల్‌ తాజాగా ముగియడంతో హైదరాబాద్‌లోనే ఇంకో షెడ్యూల్‌ను జరిపేందుకు చిత్రబృందం సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. అందులో భాగంగా దేవాలయ నేపథ్య సన్నివేశాలను తీయబోతున్నారట. తాజాగా చేయబోయే షెడ్యూల్‌తో చిత్రం మూడొంతులకు దగ్గరగా పూర్తవుతుందని అంటున్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో మహేష్‌ సరసన రష్మిక మండన్న నాయికగా నటిస్తుండగా…ఇతర ముఖ్యపాత్రలలో సీనియర్‌ నటి విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణష్‌ తదితరులు తారాగణం. దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌, లక్ష్మణ్‌, యుగంధర్‌.టి., ఎస్‌.కృష్ణ ముఖ్య సాంకేతిక వర్గం.