పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకుని తొలి రోజే ప్రేక్షకుల చేత తిరస్కరించబడ్డ సినిమాను ఎవ్వరూ కాపాడలేరు. కానీ టాక్ కొంచెం అటు ఇటుగా ఉండి.. మంచి ఓపెనింగ్స్ వచ్చినపుడు ఆ సినిమాకు ప్రమోషన్లు ఉపయోగపడతాయి. వీకెండ్ తర్వాత ఇలాంటి సినిమాల్ని వార్తల్లో నిలబెట్టడం.. ప్రమోషన్ల హంగామా చేయడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల కొన్ని సినిమాలు నిలబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఐతే నేచురల్ స్టార్ నాని మాత్రం తన కొత్త చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ను ఇలా కాపాడే ప్రయత్నం చేయలేదు. రిలీజ్ రోజు హడావుడిగా ఒక సక్సెస్ మీట్ పెట్టి హంగామా చేసిన నాని.. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ‘గ్యాంగ్ లీడర్’ తొలి వీకెండ్ లో మంచి వసూళ్లే సాధించింది. మూడు రోజుల్లో రూ.16 కోట్ల దాకా షేర్ రాబట్టింది.
ఐతే వీకెండ్ అయ్యాక వసూళ్లు బాగా డ్రాప్ అయిపోయాయి. ఈ రోజుల్లో ప్రతి సినిమాకూ ఎదురవుతున్న ఇబ్బందే ఇది. ఐతే ‘గ్యాంగ్ లీడర్’కు అడ్వాన్స్ బుకింగ్స్ మరీ గొప్పగా ఏమీ లేవు. అయినా సినిమా వీకెండ్ లో డివైడ్ టాక్ ను తట్టుకుని బాగానే నిలబడింది. అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టింది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ లో నానికి ఉన్న పట్టుకు నిదర్శనం. ఐతే వీకెండ్ తర్వాత సినిమాను ప్రమోట్ చేస్తే.. వీక్ డేస్ లో మరీ వీక్ అవ్వకుండా ఉండేది. వసూళ్లు ఇంకాస్త మెరుగ్గా ఉండేవేమో. కానీ అతను ‘వి’ సినిమా కోసం థాయ్ లాండ్ కు వెళ్లిపోయాడు. ముందుగా ఫిక్స్ అయిన షెడ్యూల్ ఏం చేయలేం అనుకోవచ్చు కానీ.. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు కూడా ముఖ్యమన్న సంగతి గుర్తించి ముందే అప్రమత్తం కావాల్సింది. కొత్త సినిమా ‘వాల్మీకి’ సైతం ‘గ్యాంగ్ లీడర్’ లాగే కొంచెం డివైడ్ టాక్ - మోడరేట్ రివ్యూలు తెచ్చుకుంది. అయితే వీకెండ్లో వసూళ్ల మోత మోగింది. సోమవారం నుంచి వసూళ్లు డ్రాప్ అవుతాయేమో అని ఈ రోజే సక్సెస్ మీట్ పెట్టారు. రేపట్నుంచి విజయయాత్ర చేస్తూ థియేటర్లు రౌండ్లు కొట్టబోతున్నారు. ఇలాంటివి కచ్చితంగా సినిమాకు ఉపయోగపడతాయి. ఈ పని నాని కూడా చేస్తే ‘గ్యాంగ్ లీడర్’ నష్టాలు తగ్గేవేమో.