చిత్రం : రాజు గారి గది-3
నటీనటులు: అశ్విన్ బాబు-అవికా గోర్-ఆలీ-ఊర్వశి-ధన్ రాజ్-బ్రహ్మాజీ-ప్రభాస్ శీను-హరితేజ-అజయ్ ఘోష్ తదితరులు
సంగీతం: షాబిర్
ఛాయాగ్రహణం: ఛోటా కే నాయుడు
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాణం: ఓక్ ఎంటర్టైన్మెంట్స్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఓంకార్

కథ:
మయా (అవికా గోర్‌) ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంటుంది. ఆమె తండ్రి గరడపిళ్లై. కేరళలో పేరుమోసిన మాంత్రికుడు. ఈ క్రమంలో మాయను ఎవ్వరూ వెంబడించి వేధించినా.. ఐ లవ్యూ చెప్పినా.. మాయాను అనుసరిస్తూ ఉండే ఓ దెయ్యం వారి భరతం పడుతుంది. మరోవైపు అశ్విన్‌ ఓ కాలనీలో ఆటోడ్రైవర్‌. నిత్యం తాగి తాందనాలు ఆడుతూ.. కాలనీ వాసులను వేధించుకు తింటుంటాడు. మాయను ప్రేమించి.. ఐలవ్యూ చెప్పి దెయ్యం చేతిలో చావుదెబ్బలు తిన్న డాక్టర్‌ శశి (బ్రహ్మాజీ).. కాలనీ వాసులతో పథకం రచించి.. మాయను అశ్విన్‌ ప్రేమించేలా చేస్తాడు. అశ్విన్‌ కూడా మాయకు ఐలవ్యూ చెప్పడంతో దెయ్యం అతనికి చుక్కలు చూపిస్తుంది. ఈ క్రమంలో గరడపిళ్లైతో తాడో-పెడో తేల్చుకోవడానికి అశ్విన్‌, తన మామా అలీతో కలిసి కేరళ వెళుతాడు. అక్కడ అశ్విన్‌కు ఎదురైన పరిస్థితులేమిటి? యక్షిని ఎవరు? మాయకు రక్షణగా యక్షిని ఎందుకు తిరుగుతుంది? యక్షిని బారి నుంచి మాయను ఎలా రక్షించి.. అశ్విన్‌ పెళ్లి చేసుకున్నాడు? రాజుగారి గదిలో వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? అన్నది తెలుసుకోవడానికి సినిమా చూడాలి

విశ్లేషణ:
`రాజుగారిగ‌ది` ఓంకార్‌కి ద‌ర్శ‌కుడిగా చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. దాంతో ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున‌, స‌మంత‌లు క‌లిసి `రాజుగారిగ‌ది 2` కూడా చేశారు. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే ఈ రెండు చిత్రాల్లో ఓంకార్ హార‌ర్‌, కామెడీ అంశాల‌తో పాటు మెసేజ్‌ల‌ను కూడా మిళితం చేసి సినిమాను తెర‌కెక్కించాడు. తాజాగా.. ఈ ఫ్రాంచైజీలో వ‌చ్చిన రాజుగారిగ‌ది 3లో హార‌ర్‌, కామెడీ అంశాల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త‌ల‌ను ఇచ్చిమెసేజ్ ఇవ్వ‌లేదు. అంతే కాకుండా హార‌ర్ కామెడీ చిత్రాలు ఇప్పుడు టాలీవుడ్‌లో చాలా ఎక్కువ‌గా వ‌చ్చాయి. కాబ‌ట్టి ఈ సినిమాలో సెకండాఫ్‌లో వ‌చ్చే బంగ్లాలోని హార‌ర్ కామెడీ స‌న్నివేశాలు మిన‌హా మ‌రేమీ ఆక‌ట్టుకోవు. ఫ‌స్టాఫ్ అంతా సాగ‌దీత‌గా క‌న‌ప‌డుతుంది. సెకండాఫ్‌లో ప్రీక్లైమాక్స్‌లో వ‌చ్చే 20 నిమిషాల‌ హార‌ర్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్ష‌కుల‌ను బాగా న‌వ్విస్తాయి. ముఖ్యంగా అజ‌య్‌ఘోష్‌, ఊర్వ‌శి, అలీ పాత్ర‌లు సెకండాఫ్‌లో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించ‌డంలో స‌క్సెస్ అయ్యాయి. డైరెక్ట‌ర్ ఓంకార్ ఆ విష‌యంలో స‌క్సెస్ అయ్యారు. అయితే ఫ‌స్టాఫ్ గొప్ప‌గా ఏమీ అనిపించ‌లేదు. ఎంగేజింగ్‌గా లేదు. న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే అశ్విన్‌బాబు పాత్ర చుట్టూనే క‌థంతా తిరుగుతుంది. త‌న పాత్ర‌కు త‌న న‌ట‌న ప‌రంగా న్యాయం చేశాడు. ఇక అవికా గోర్ పాత్ర ఓకే అనిపించింది. సినిమాలో అజ‌య్‌ఘోష్‌, ఊర్వ‌శి, అలీ పాత్ర‌ల‌తోనే సినిమా ఆ మాత్ర‌మైనా కామెడీగా అనిపించింది. ఈ మూడు పాత్ర‌ల్లో కామెడీ ఉండేలా ద‌ర్శ‌కుడు సినిమాను బాగానే ద‌ట్టించాడు. ష‌బీర్‌ సంగీతం సాహిత్యాన్ని డామినేట్ చేసేసింది. హార‌ర్ పార్ట్స్‌కు నేప‌థ్య సంగీతం ప‌రావాలేదు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ బావుంది.

నటీనటులు: 
అశ్విన్ దయ్యం పూనినపుడు అమ్మాయి తరహాలో నడుస్తూ హావభావాలు పలికించే సన్నివేశంలో బాగా చేశాడు. అంతకుమించి సినిమాలో అతను పెర్ఫామ్ చేయడానికి పెద్దగా స్కోప్ లేకపోయింది. అవికా గోర్ ఎందుకు ఈ సినిమా ఒప్పుకుందో అర్థం కాదు. కథలో ఆమెకు కనీస ప్రాధాన్యం లేదు. ఉత్సవ విగ్రహంలా మారిపోయింది. మంచి నటి అయిన ఆమెకు ఇలాంటి పాత్ర ఎలా ఇచ్చారో? ఊర్వశి.. అజయ్ ఘోష్.. ఆలీ.. ధనరాజ్ తమ పాత్రల పరిధిలో బాగా నవ్వించారు. సినిమాను కాస్తో కూస్తో నిలబెట్టింది వీళ్లే. ద్వితీయార్ధంలో అరగంటలో వీళ్ల కామెడీ మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతికవర్గం: 
‘రాజు గారి గది-3’లో పాటలకు ఏ ప్రాధాన్యం లేదు. హీరో హీరోయిన్ల మీద తీసిన లవ్ సాంగ్ బోరింగ్. ఐటెం సాంగ్ లోనూ ఏ విశేషం లేదు. నేపథ్య సంగీతం విషయంలో మాత్రం షాబిర్ ప్రతిభ చాటుకున్నాడు. దయ్యంతో ముడిపడ్డ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బలంగా నిలిచింది. ప్రేక్షకుల్లో భయం పుట్టించింది. ఛోటా కే నాయుడు కెమెరా పనితనం కూడా ఈ సన్నివేశాల్లోనే కనిపించింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి సరిపోయేట్లుగా ఉన్నాయి. ఆర్ట్ వర్క్ సినిమాకు తగ్గట్లుగా ఉంది. ఎఫెక్ట్స్ ఓకే. సాయిమాధవ్ బుర్రా సంభాషణల్లో ఆయన ముద్ర కనిపించలేదు. ‘‘నువ్విలా విజ్ఞాన ప్రదర్శన చేస్తుంటే నాకు విరేచనాలవుతున్నాయి’ ‘పై నుంచి పడాల్సిన వర్షం నా పంచె లోంచి పడుతోంది’’.. ‘‘మూత్రం వచ్చే సమయంలో మంత్రాలు ఎలా వస్తాయిరా’’.. ఇలా సినిమాకు తగ్గట్లుగా మాటు రాశారాయన. ఇక రచయిత-దర్శకుడు ఓంకార్.. కేవలం మాస్ కామెడీని నమ్ముకుని సినిమాను లాగించేశాడు. కథాకథనాల మీద ఏమాత్రం కసరత్తు చేయలేదు. మరీ నాటుగా సాగిపోయే అతడి కామెడీ ఓ వర్గం ప్రేక్షకుల్ని మ ాత్రం మెప్పిస్తుంది. ఎంత దయ్యం కథ అయినప్పటికీ కాస్తయినా లాజిక్ ఉండాలి.. సీరియస్నెస్ ఉండాలనే విషయాన్ని అతను పట్టించుకోలేదు. అతడి ‘రాజు గారి గది’సిరీస్ లో వీకెస్ట్ ఇదే అనడంలో సందేహం లేదు.