ఉపాసన తాజాగా దేశ ప్రధానిని ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడు సినీ వర్గాలతో పాటు పొలిటికల్‌ సర్కిల్స్‌లోనూ ఈ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది.భారత ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఢిల్లీలోని లోక కళ్యాణ్‌ మార్గ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి షారూఖ్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, కంగనా రనౌత్‌, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌ సహా టెలివిజన్, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.ఈ విషయాన్ని మోదీ ట్విటర్‌లో సైతం పంచుకున్నారు.ఆ కార్యక్రమంలో దక్షిణాది సినీ ప్రముఖులకు చోటు కల్పించనందుకు బాధ పడుతున్నట్టు చిరంజీవి కోడలు, రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. ‘‘ప్రియమైన నరేంద్రమోదీజీ... దక్షిణ భారతీయులైన మాకు మీరంటే ఎంతో గౌరవం. మీరు దేశ ప్రధాని అయినందుకు మేమెంతో గర్విస్తున్నాం. మీ నివాసంలో కార్యక్రమానికి హిందీ తారలను మాత్రమే ఆహ్వానించారని మేం భావిస్తున్నాం. దక్షిణాది చిత్రసీమను పూర్తిగా విస్మరించారు. బాధతో నా భావాన్ని తెలియజేస్తున్నా. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’’ అని ఉపాసన అన్నారు.కాగా దక్షిణాది చిత్ర పరిశ్రమను చిన్నచూపు చూడటం అనాది నుంచి వస్తుందే. కానీ ఈ విషయంపై ప్రధానిని గొంతెత్తి ప్రశ్నించిన ఉపాసనకు దక్షిణాది ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుతున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్‌ సంచలనంగా మారింది.