అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం ‘అల... వైకుంఠపురములో...’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.ఈ సినిమా ఆల్బమ్‌లోని తొలిపాట ‘సామజవరగమన’ను ఇప్పటికే విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మాస్ నంబర్ ‘రాములో రాములా’ అంటూ సాగే పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.ఈ సినిమాలోని ‘రాములో.. రాములా..’ సాంగ్‌ టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. పూర్తి పాటను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.అనురాగ్ కులకర్ణి, మంగ్లి ఆలపించిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించారు. ‘రాములో రాములా.. నన్నాగం చేసిందిరో. రాములో రాములా నా పాణం తీసిందిరో’ అనే పదాలను టీజర్‌లో వినిపించారు. కాగా, ఈ సినిమాలో సీనియర్ నటి టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుశాంత్, నివేత పేతురాజ్, నవదీప్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది.