నటుడిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ నాని.. నిర్మాతగా విభిన్న సినిమాలను ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు.కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేసే క్ర‌మంలో భాగంగా వాల్‌పోస్ట‌ర్ సినిమా అనే బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేసి తొలి ప్ర‌య‌త్నంలోనే `అ!` వంటి డిఫ‌రెంట్ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించి నిర్మాత‌గా స‌క్సెస్‌ను సాధించారు. ఫలక్ నుమా దాస్, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలలో హీరోగా చేసిన విశ్వక్ సేన్ హీరోగా ఆయన ఓ నూతన చిత్రాన్ని నేడు ప్రారంభించారు. ‘హిట్’ అనే డిఫరెంట్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ నేడు పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. నూతన దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా రుహాని శర్మ విశ్వక్ సేన్ పక్కన జంటగా నటిస్తుంది. విశ్వక్ సేన్ హీరోగా మొదటి సినిమా ఫలక్‌నుమా దాస్ తో మంచి పేరు దక్కించుకున్నాడు. ఆ సినిమా తర్వాత మంచి సబ్జెక్ట్ కోసం ఎదురు చూస్తున్న ఆయనకు హిట్ నచ్చి చేసేందుకు ముందుకు వచ్చాడట. నాని ఈ చిత్రంను నిర్మించడంతో పాటు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తన 25వ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. 'వి' టైటిల్ తో రూపొందుతున్న ఆ సినిమాలో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.