నటీనటులు : విజయ్,నయనతార,యోగి బాబు,వివేక్,జాకీ ష్రాఫ్,ఖదీర్ తదితరులు

దర్శకత్వం : అట్లీ

నిర్మాత‌లు : కళాపతి ఎస్ అఘోరం

సంగీతం : ఏ ఆర్ రెహమాన్

సినిమాటోగ్రఫర్ : జి కె విష్ణు

ఎడిటర్ : రూబెన్

వరుస విజయాలతో తిరుగులేని ఫామ్‌లో ఉన్న తమిళ స్టార్‌ హీరో  విజయ్‌. మెర్శల్‌, సర్కార్‌ వంటి భారీ సూపర్‌హిట్స్‌ ఊపుమీదున్న ఆయన.. మరోసారి దర్శకుడు అట్లీతో జతకట్టి ‘విజిల్‌’ అనే స్పోర్ట్స్‌ డ్రామాతో తెరమీదకు వచ్చారు. ఇంతకుమునుపు విజయ్‌-అట్లీ కాంబినేషన్‌లో తేరి, మెర్శల్‌ వంటి బాక్ల్‌బస్టర్‌ హిట్‌ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా వస్తుండటం, ఈ సినిమాలో విజయ్‌ డ్యుయల్‌ రోల్‌ చేస్తుండటంతో..  హ్యాట్రిక్‌ సూపర్‌హిట్‌ ఖాయమని ధీమాతో ఉన్నారు ఫ్యాన్స్‌. విజయ్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

క‌థ‌:

రాజ‌ప్ప‌(విజ‌య్‌) విశాఖ‌ప‌ట్నంలో ఓ రౌడీ. త‌న బ‌స్తీలోని ప్ర‌జ‌ల మంచి కోసం పాటుప‌డుతుంటాడు. రాజ‌ప్ప త‌న‌యుడు మైకేల్ అలియాస్ బిగిల్‌(విజ‌య్‌) చాలా పెద్ద ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌. కొడుకు త‌న ఫుట్‌బాల్ ఆట‌తోనే బ‌స్తీలోని కుర్రాళ్లలో మార్పు తెస్తుండ‌టం గ‌మ‌నించిన రాజ‌ప్ప అత‌న్ని గొడ‌వ‌ల‌కు దూరంగా ఉండ‌మ‌ని చెబుతాడు. త‌ను నేష‌న‌ల్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ కావాల‌ని క‌ల‌లు కంటాడు. అలాంటి క్ర‌మంలో రాజ‌ప్ప‌ని ప్ర‌త్య‌ర్థులు చంపేస్తారు. మైకేల్ త‌న బ‌స్తీ వారి కోసం క‌త్తిప‌డ‌తాడు. అత‌ని స్నేహితుడు కోచింగ్ ఇస్తున్న మ‌హిళ‌ల ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌కు నాట‌కీయ ప‌రిస్థితుల మ‌ధ్య గాయాలవుతాయి. అత‌ని స్థానంలో మైకేల్ కోచ్‌గా వెళ‌తాడు. రౌడీ అయిన మైకేల్‌ను కోచ్‌లో ఫుట్‌బాల్ టీమ్‌లో అమ్మాయిలు అంగీక‌రిస్తారా? శ‌ర్మ‌(జాకీష్రాఫ్‌) ఎవ‌రు? చివ‌ర‌కు రాజ‌ప్ప క‌ల‌ను మైకేల్ ఎలా నేర‌వేర్చాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

స్పోర్ట్స్‌ డ్రామాకు బలమైన భావోద్వేగాలు ముఖ్యం. తెరమీద కనిపిస్తున్న ఆట నిజంగా జరుగుతున్నట్టే అనిపిస్తూ.. అందులో ప్రేక్షకుడిని మమేకం చేయాలి. అప్పుడే తెరమీద భావోద్వేగాలు పండుతాయి. షారుఖ్‌ ఖాన్‌ ‘చక్‌ దే ఇండియా’, సల్మాన్‌ ఖాన్‌ ’సుల్తాన్‌’,, ఆమీర్‌ ఖాన్‌ ‘దంగల్‌’, మాధవన్‌ ‘గురు’ సినిమాలు ఈవిధంగా తెరమీద భావోద్వేగాలను అద్భుతంగా పండించి.. ప్రేక్షకులతో శెభాష్‌ అనిపించుకున్నాయి. బిగిల్‌ పేరుకు స్పోర్ట్స్‌ డ్రామా అయినా అందులో ఫక్తు మాస్‌ యాక్షన్‌ సీన్లు బోలెడు ఉన్నాయి. విజయ్‌లాంటి స్టార్‌ హీరోతో పూర్తిస్థాయి స్పోర్ట్స్‌ డ్రామా చేయడం బాగుండదనుకున్నాడేమో డైరెక్టర్‌.. కథ కంటే కూడా ప్రతి 20, 30 నిమిషాలకు ఒక ఫైట్‌ సీన్‌..హీరోను ఎలివేట్‌ చేసే సీన్లతో విసిగించాడు. అంతేకాకుండా సినిమా నిడిమి చాలా ఎక్కువైపోవడంతో కథ మీద దర్శకుడికి పట్టు తప్పినట్టు కనిపిస్తుంది. చాలా సీన్లు సాగదీతతో ఉండి.. తమిళ వాసనలతో బోర్‌ కొట్టిస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్‌ భరించడం చాలా కష్టమే. ఫస్టాఫ్‌లో తండ్రీ-కొడుకుగా డ్యుయల్‌ రోల్స్‌లో విజయ్‌ పండించిన వేరియేషన్స్‌, వారి మధ్య అనుబంధం కొంచెం ఆకట్టుకుంటుంది. ఇక, ఫస్టాఫ్‌లో కనిపించే తండ్రి పాత్రకు పూర్తిస్థాయి న్యాయం జరిగినట్టు కనిపించదు. రాజప్ప నేపథ్యమేమిటో పూర్తిగా చూపించకుండానే దర్శకుడు అర్ధంతరంగా ముగించేసిన భావన కలుగుతుంది.

ఇక, ఫస్టాఫ్‌లో సాఫ్ట్‌రోల్‌లో కనిపించిన ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు జేకే శర్మ (జాకీష్రాఫ్‌)  సెకండాఫ్‌లో విలన్‌గా అవతారమెత్తుతాడు. ప్లాష్‌బ్యాక్‌లో రాజప్ప తనను చితకబాదినందుకు.. ఇప్పుడు కోచ్‌ మైఖేల్‌, అతని టీమ్‌ను ఓడించి.. ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. ఇలా మైదానంలో క్రీడాపరమైన ఉద్వేగాల కంటే.. హీరో-విలన్‌ మధ్య పోటాపోటీ  సీన్లు.. కేవలం హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసినందుకు పెట్టినట్టు అనిపిస్తుంది. అయితే, మన దేశంలో క్రీడల్లోకి వచ్చేందుకు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దర్శకుడు అట్లీ కొంత నిజాయితీగా చూపించడం ఆకట్టుకుంటుంది. తనకు ప్రేమ కన్నా ఫుట్‌బాలే ముఖ్యమన్నందుకు ఓ ఉన్మాది చేతిలో యాసిడ్‌ దాడికి గురైన అమ్మాయి.. కోచ్‌ ఇచ్చిన మనోస్థైర్యంతో తిరిగి జట్టులోకి వచ్చి రాణించడం, పెళ్లయి.. సంప్రదాయ కుటంబంలో గృహిణిగా సెటిలైన యువతి తిరిగి జట్టులోకి రావడం వంటి చక్కని అంశాలు సినిమాలో ఆకట్టుకుంటాయి. ఇక, ఫుట్‌బాల్‌ గేమ్‌లోనూ భావోద్వేగాల కంటే.. ప్రేక్షకులను కట్టిపడేసి విన్యాసాలను చూపించడానికే ప్రాధాన్యమిచ్చినట్టు కనిపిస్తోంది. ఏఆర్‌ రహమాన్‌ సంగీతం అంతగా ఆకట్టుకోకపోయినా.. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు ప్రధాన అస్సెట్‌గా నిలిచింది. ముఖ్యంగా శివంగివే పాట స్ఫూర్తిదాయకంగా ఉంది. జీకే విష్ణు నీట్‌ సినిమాటోగ్రఫి, ఆర్ట్‌ డైరెక్టర్‌ ముథురాజు పనితనం సినిమాలో కనిపిస్తోంది. చిత్రస్థాయికి తగ్గట్టు నిర్మాణ విలువలు ఉన్నాయి. సినిమాకు బాగా కత్తెరవేసి.. ట్రిమ్‌ చేసి.. కథను క్రిస్ప్‌గా తెరకెక్కించి ఉంటే బాగుండేది.  ఎప్పటిలాగే విజయ్‌ తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోగా.. అతన్ని ప్రేమించే ఏంజిల్‌ ఆశ్విరాదంగా ఓ మోస్తరు పాత్రకు నయనతార పరిమితమైంది.