తెలుగు చిత్రరంగంలో ఒక వెలుగు వెలిగిన సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు.గుండెపోటుతో హైదరాబాద్ లోని ఫిలింనగర్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆమె  చికిత్స పొందుతూ  బుధవారం  రాత్రి 11.45 గంటలకు ఆమె మృతి చెందారు. ఆమె వయస్సు 72 ఏళ్లు..1947 లో కాకినాడలో జన్మించిన ఆమె అసలు పేరు మణి..మొదట హిందీలో ‘పేయింగ్ గెస్ట్’ అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు..  1961లో ఎన్టీఆర్ సీతారాముల కల్యాణం సినిమా ద్వారా  తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించారు. అంతే కాకుండా ప్రతి పెళ్లి పందిట్లో ఇప్పటికే మారు మోగే సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి సాంగ్ ను కూడా గీతాంజలి ఆలపించారు.. అప్పటికి ఆమె వయస్సు 14 ఏళ్లు.తొలితరం సీతగా ఆమె ఎనలేని ఖ్యాతిని పొందారు. శ్రీశ్రీ మర్యాదరామన్న,   డాక్టర్ చక్రవర్తి, బొబ్బిలి యుద్ధం, ఇల్లాలు, తోడ నీడ, లేత మనసులు, దేవత, శ్రీకృష్ణావతారం, ప్రాణమిత్రులు, పూలరంగడు, గూఢాచారి 116, నిర్దోషి, మాయాజాలం, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో గీతాంజలి నటించారు. చివరగా నాగార్జున నటించిన భాయ్ చిత్రంలో కనిపించిన గీతాంజలి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీరామమూర్తి, శ్వామసుందరి దంపతులకు జన్మించారు. కాకినాడలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంటులో కొన్నేళ్లు చదివిన గీతాంజలి. ఐదేళ్ల వయసు నుంచే గీతాంజలి తన అక్క స్వర్ణతో పాటు గంధర్వ నాట్యమండలిలో లక్ష్మారెడ్డి, శ్రీనివాసన్ ల వద్ద నాట్యం నేర్చుకున్నారు. ఆరో ఏట నుంచి అక్కతో కలిసి నాట్య ప్రదర్శనలు ప్రారంభించారు. ఎన్టీఆర్‌ను తన సినీ గురువుగా గీతాంజలి చెప్పుకునేవారు. సీతారాముల కళ్యాణం సినిమాలో కథానాయికగా తనను ఎంపికచేసి సీత పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారని అనేవారు. ఆ పాత్ర వల్లే తనకంటూ తెలుగులో ఓ ప్రత్యేకత వచ్చిందని ప్రతి ఇంటర్వ్యూలోనూ గీతాంజలి తలచుకునేవారు.