టైటిట్‌: మీకు మాత్రమే చెప్తా
జానర్‌: యుత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్
నటీనటులు: తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్, వాణి భోజన్, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్
దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్
నిర్మాతలు: వర్ధన్ దేవరకొండ, విజయ్ దేవరకొండ
బ్యానర్‌: కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి ఇప్పుడు నిర్మాత అవతారం ఎత్తారు. కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారు. ‘పెళ్లి చూపులు’ సినిమా సమయంలో తన వద్దకు వచ్చిన కథను.. ఆ సినిమా డైరెక్టర్‌ తరుణ్ భాస్కర్‌ను హీరోగా చేసి ఇప్పుడు తెరకెక్కించారు.

కథ:
రాకేశ్‌ (తరుణ్‌ భాస్కర్‌), కామేశ్‌ (అభినవ్‌ గోమటం) జాన్‌జిగిరీ దోస్తులు. ఒక టీవీ చానెల్‌లో ఇద్దరూ పనిచేస్తుంటారు. రాకేశ్‌, కామేశ్‌ ఇద్దరూ డాక్టర్లను ప్రేమిస్తారు. రాకేశ్ ప్రతి విషయంలో అబద్ధాలు చెప్తుంటాడని ప్రతి విషయంలోనూ అతని లవర్‌ స్టెఫీ అనుమానిస్తూ ఉంటుంది. పెదవాళ్లను ఒప్పించి రాకేశ్‌ స్టెఫీని పెళ్లాడేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో పెళ్లికి రెండురోజుల ముందు రాకేశ్‌ ఫోన్‌కు ఒక వీడియో వస్తుంది. ఒక అమ్మాయితో హానీమూన్‌లో గడుపుతున్నట్టు ఆ వీడియో ఉంటుంది. ఎవరో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన ఈ వీడియో పెళ్లికి ముందు బయటపడితే.. తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని రాకేశ్‌ తీవ్రంగా టెన్షన్‌ పడుతుంటాడు. మరోవైపు స్టెఫీని లవ్‌ చేస్తున్న ఆమె బావ జాన్సన్‌ పెళ్లిని ఆపేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇంకోవైపు ప్రతి విషయంలో రాకేశ్‌ అబద్ధాలు చెప్తున్నాడని స్టెఫీని అనుమానిస్తుంటుంది. అసలు ఈ వీడియో ఎక్కడిది? నిజంగానే ఓ యువతితో రాకేశ్‌ గడిపాడా? ఆ వీడియోను డిలీట్‌ చేసేందుకు రాకేశ్‌, కామేశ్‌ ఏం చేశారు? కింగ్‌ హ్యాకర్‌ ఎవరు? చివరకు రాకేశ్‌ పెళ్లి ఎలా జరిగింది? కామేశ్‌ మీకు మాత్రమే చెప్తా అని మొదలుపెట్టిన ఈ కథ అసలు ఎవరిది అన్నది తర్వాతి కథ.

విశ్లేష‌ణ‌:
త‌న‌కు హీరోగా బ్రేక్ ఇచ్చిన త‌రుణ్ భాస్క‌ర్‌ను హీరోగా పెట్టి సినిమా చేయాలేనుకోవ‌డం ధైర్య‌మే. విజ‌య్ దేవ‌రకొండ అలాంటి ప్ర‌య‌త్నాన్ని ధైర్యంగా చేశాడు. త‌రుణ్‌ని హీరోగా పెట్టి ష‌మీర్ సుల్తాన్ అనే కొత్త దర్శ‌కుడితో సినిమా చేశాడు. మ‌న ఫోన్‌లోని ఓ వీడియో లీక్ అయిన‌ప్పుడు మ‌నం ప‌డే టెన్ష‌న్ ఎలా ఉంటుంది? అనే పాయింట్‌ను తెర‌పై చ‌క్క‌గా చూపించాడు స‌మీర్ సుల్తాన్‌. సినిమా అంతా ఈ పాయింట్ మీద‌నే న‌డుస్తుంది. సినిమాలో పాత్ర‌లు కూడా ప‌రిమితంగానే ఉన్నాయి. ప‌రిమిత‌మైన పాత్ర‌ల‌తో ష‌మీర్ సినిమాను తెర‌కెక్కించిన తీరు బావుంది. త‌రుణ్‌భాస్క‌ర్‌ను ఏదో హీరోగా చూపించాల‌నే తాపత్రయంతో కాకుండా.. క‌థానుగుణంగా ఉండే పాత్ర‌ధారిగా చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు భిన్న‌మైన సినిమా. క‌థ‌నం ఇది వ‌ర‌కు కొన్ని సినిమాల్లో చూపించిన‌ట్లే ఉన్నా.. ఎంట‌ర్‌టైనింగ్‌గా క‌థ‌ను ముందుకు తీసుకెళ్ల‌గ‌లిగాడు ద‌ర్శ‌కుడు ష‌మీర్. ఇక అభిన‌వ్ గోమ‌టం న‌ట‌న సినిమాకు ప్ల‌స్ అయ్యింది. త‌న‌దైన న‌ట‌తో అభినవ్ ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాడు. ఇక అన‌సూయ భ‌రద్వాజ్ కీల‌క పాత్ర‌లో న‌టించింది. మ‌ద‌న్ గుణ‌దేవా కెమెరా వ‌ర్క్‌ బావుంది. శివ‌కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. వాణి భోజన్ ప్రధాన పాత్రలో నటించగా.. పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల పరిధి మేర చ‌క్క‌గా న‌టించారు. సెకండాఫ్ అంతా ల్యాగ్‌గా అనిపిస్తుంది. సినిమాలో ఎక్కువ ట్విస్టులు లేవు. క‌థంతా ఓ పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. ఫ‌స్టాప్ కాస్త ఫ‌న్నీగా న‌డిచినా వ‌న్ టైమ్ వాచింగ్ మూవీ.