స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు
న‌టీన‌టులు: ర‌విబాబు, నేహా చౌహాన్‌, శ్రీముక్త‌, భ‌ర‌ణి శంక‌ర్‌, ముక్తార్ ఖాన్, ప్రియ వ‌డ్ల‌మాని త‌దిత‌రులు
ఆర్ట్‌: నారాయ‌ణ రెడ్డి
ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
యాక్ష‌న్‌: స‌తీశ్‌
కెమెరా: ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి
మ్యూజిక్: వైధి
స్క్రీన్‌ప్లే: స‌త్యానంద్‌
ర‌చ‌న‌, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: ర‌విబాబు

కథ :
రాజ్‌ కుమార్ రావు (రవిబాబు) తన భార్య లీనా( నేహా చౌహాన్) మరియు కూతుర్లు శ్రేయ, మున్నిలతో హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్న క్రమంలో.. ఓ ప్రమాదంలో పెద్ద కూతురు శ్రేయ చనిపోతుంది. దాంతో ఆ ఇంట్లో ఉంటే శ్రేయనే గుర్తుకు వస్తుందని.. ఒక పాత పెద్ద బంగ్లాలోకి ఫ్యామిలీ షిఫ్ట్ అవుతారు. అయితే ఆ ఇంట్లో మున్ని తనతో ఎవరో (దెయ్యం) మాట్లాడుతున్నట్లు బిహేవ్ చేస్తోంది. చివరికి ఆ దెయ్యం సాయంతో ఇల్లు వదిలిపోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అసలు మున్ని ఎందుకు ఇల్లు వదిలి వెళ్లిపోవాలనుకుంది ? ఈ క్రమంలో రాజ్ కుమార్, లీనా ఏం చేశారు ? ఇంతకీ మున్నితో మాట్లాడుతున్న ఆ దెయ్యం ఎవరు ? ఆ దెయ్యానికి రాజ్ కుమార్ కి సంబంధం ఏమిటి ? ఆ దెయ్యం దేని కోసం రాజ్ కుమార్ ఫ్యామిలీని టార్గెట్ చేసింది ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
భార్య, భర్త.. ఇద్దరు పిల్లలు. తండ్రి నిర్లక్ష్యం వల్ల ఒక కూతురు చనిపోతుంది. మిగిలి బిడ్డనైనా జాగ్రత్తగా కాపాడుకోవాలని తల్లి ప్రయత్నిస్తుంటుంది. అందులో తల్లి ప్రేమను చక్కగా చూపించాడు డైరెక్టర్. డబ్బు సంపాదన కోసం 24 గంటలు వ్యాపారాల్లో బిజీగా ఉంటూ పిల్లలను పట్టించుకోకపోతే వాళ్లు ఎలా ఫీలవుతారనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే అది ప్రేక్షకులకు అర్థమయి కానట్టు ఉంటుంది. అవును సినిమాలోలా ఇందులోనూ కనపడని ఆత్మ మధ్య మధ్యలో వస్తుంటుంది. ఆత్మతో మాట్లాడుతూ ఇంట్లో నుంచి వెళ్లేందకు మున్ని పదే పదే ప్రయత్నించే సన్నివేశాలతో ఫస్ట్ ఆఫ్‌ నెమ్మదిగా సాగుతుంది.
 
అసలు కథ సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. మున్నీ మిస్ అవడంతో రాజ్ స్నేహితుడు పోలీసాఫీసర్ వినోద్ (ముక్తా ఖాన్), అతని ఫ్రెండ్ డాక్టర్ పవన్ శర్మ (భరణీ శంకర్) ఎంటర్ అవ్వడంతో కథనం కాస్త ముందుకు వెళ్తుంది. రాజ్ నిర్లక్ష్యం వల్లే అతని పెద్ద కూతురు చనిపోయిందని తెలుసుకున్న పవన్ శర్మ.. మున్నీ మిస్సింగ్ కేసును హ్యాండిల్ చేసే విధానం.. లీనానే మున్నీని దాచేసిందని కనిపెట్టడం, రాజ్‌పై లీనా దాడి చేయడం, లీనాలో ఉన్న ఆత్మ జాన్వీది అని తెలుసుకోవడంతో కథలో ఊహించని ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్‌తో క్లయిమాక్స్ ప్రేక్షకుల ఊహకు సులువుగా అందుతుంది.

సాంకేతిక విశ్లేషణ:
రవిబాబు ఇటు దర్శకుడిగా.. అటు నటుడిగా మరో వైపు నిర్మాతగా త్రిపాత్రాభినయం పోషించాడు. ‘ఆవిరి’ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో ఆత్మ ఉన్నట్టు చూపించిన రవిబాబు.. సినిమాలో దాన్ని ఎక్కడా చూపించలేదు. ఆత్మలను ఆవిరితో పోల్చడం.. దెయ్యాలకు వేడి అంటే భయమని చెప్పడం.. రవిబాబుకే చెల్లింది. పేరెంటింగ్ అనే మెసేజ్‌కు ఆత్మను జోడించి హారర్ థ్రిల్లర్ జోనర్‌లో రవిబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 
ఇలాంటి హారర్, థ్రిల్లర్ సినిమాలంటే సంగీతం, నేపథ్యసంగీతం ప్రధానంగా అవసరం. వైద్య అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను సందర్భానుసారంగా భయపెట్టింది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు చక్కగా కుదిరింది. ఎడిటర్ తన కత్తెరకు మరింత పదును పెట్టాల్సింది. సినిమాకు అవసరమైన రీతిలో నిర్మాణ విలువలు ఉన్నాయి.