టైటిల్‌: తిప్పరా మీసం

జానర్‌: థ్రిల్లర్‌

నటీనటులు: శ్రీవిష్ణు, నిక్కీ తంబోలీ, సీనియర్‌ నటి రోహిణి, బెనర్జీ, 

దర్శకుడు: ఎల్‌ కృష్ణవిజయ్

నిర్మాత: రిజ్వాన్‌

సంగీతం: సురేశ్‌ బొబ్బిలి

డీవోపీ: సిద్‌

యంగ్ హీరో శ్రీవిష్ణు – నిక్కీ తంబోలి హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం తిప్ప‌రా మీసం.అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి  సినిమాలతో శ్రీవిష్ణు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేశాడు.ఈ హీరో ఇప్పుడు `తిప్ప‌రామీసం` అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. టైటిల్ చూస్తే మాస్‌గా ఉన్న‌ప్ప‌టికీ ఇది త‌ల్లి, కొడుకు అనుబంధాన్ని చూపించే చిత్రంగా రూపొందింది. `అసుర‌` చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కృష్ణ విజ‌య్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. మ‌రి శ్రీవిష్ణు ఈ చిత్రంతో నిజంగానే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మీసం తిప్పాడా? లేదా? అని తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం.

కథ:

మణిశంకర్‌ (శ్రీవిష్ణు) చిన్న వయస్సులోనే చెడు సాహవాలతో డ్రగ్స్‌కు అలవాటుపడుతాడు. ఇలాగే వదిలేస్తే.. అతని పరిస్థితి చేయిదాటిపోతుందేమోనని, డ్రగ్స్‌కు పూర్తిగా బానిస అవుతాడేమోనని భయపడి తల్లి లలితాదేవి (రోహిణి) అతన్ని రిహాబిటేషన్‌ సెంటర్‌లో చేరుస్తోంది. అక్కడ ఎవరూ తోడులేక తీవ్ర ఒంటరితనంలో మగ్గిపోయిన మణి.. తల్లి మీద ద్వేషం పెంచుకుంటాడు. అక్కడి నుంచి పారిపోయి  ఓ పబ్‌లో డీజేగా పనిచేస్తూ ఇష్టారాజ్యంగా బతుకుతుంటాడు. తల్లి ఇంటి గడప కూడా తొక్కని అతని.. డబ్బుల కోసం మాత్రం తల్లిని వేధిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ క్రికెట్‌ బూకీ వద్ద తాను చేసిన అప్పును తీర్చేందుకు ఏకంగా తల్లి మీద మణి కోర్టులో కేసు వేస్తాడు. ఆమె రూ. 5 లక్షల చెక్కు ఇస్తే.. దానిని ఫోర్జరీ చేసి.. అది బౌన్స్‌ కావడంతో తల్లిని కోర్టుకీడుస్తాడు. ఏదీఏమైనా పరిస్థితులకు ఎదురెళ్లి తను అనుకున్నది సాధించాలనుకునే మణి.. అనూహ్య పరిణామాల నడుమ ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు. కాళీతో గొడవలు ఉన్నప్పటికీ.. అతన్ని తాను హత్య చేసినట్టు చెప్పి మణి జైలుశిక్ష అనుభవిస్తాడు. అసలు కాళీని చంపిందెవరు? ఆ మర్డర్‌ కేసును మణి ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు మణి మారిపోయి తల్లి ప్రేమను అంగీకరించి.. మంచి వాడిగా మారడానికి కారణమేమిటి? అన్నది సినిమాలో చూడాలి.

విశ్లేష‌ణ‌:

శ్రీవిష్ణు మ‌రోసారి వైవిధ్యమైన పాత్ర‌నే ఎంచుకున్నారు. పాత్ర ప‌రంగా చూస్తే ఎక్క‌డా ఓవ‌ర్ మాస్ ఎలిమెంట్స్‌, హీరోయిజం క‌న‌ప‌డదు. కంటెంట్ ప‌రంగానే సినిమా ర‌న్ అవుతుంది. అందుకు త‌గిన‌ట్లే శ్రీవిష్ణు క్యారెక్ట‌ర్ సినిమాలో ర‌న్ అవుతుంది. మ‌ణిశంక‌ర్ అనే పాత్ర‌లో శ్రీవిష్ణు చ‌క్క‌గా న‌టించాడు. త‌ల్లిని ద్వేషించే కొడుకు పాత్ర‌లో ఓ యాంగిల్‌... కుటుంబం కోసం నేర‌స్థుడిగా మారే కొడుకుగా మ‌రో యాంగిల్‌లో శ్రీవిష్ణు త‌న‌దైన న‌ట‌న‌తో ఆట్టుకున్నాడు. ద‌ర్శ‌కుడు కృష్ణ విజ‌య్ ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నా.. దాని చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా లేవు. త‌ల్లిని ద్వేషించే కొడుకుగా ఓ కార‌ణాన్ని చూపించాడు. అదంత బ‌ల‌మైన కార‌ణంగా క‌నిపించ‌దు. స‌రే! అనుకున్నా.. హీరో క్యారెక్ట‌ర్‌ను త‌ర్వాత డిజైన్ చేసిన తీరు, దాని చుట్టూ రాసుకున్న స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడి స‌హనానికి ప‌రీక్ష పెడ‌తాయి. నిక్కి తంబోలి పాత్ర ప‌ర‌మితం. పాత్ర ప‌రిధి మేర త‌ను చ‌క్క‌గా న‌టించింది. ఇక త‌ల్లి పాత్ర‌లో న‌టించిన రోహిణి చాలా చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌ప‌రిచారు. ఇక సినిమాలో మిగిలిన పాత్ర ధార‌లంద‌రూ వారి వారి ప‌రిధులు మేర న‌టించారు. సురేష్ బొబ్బ‌లి సంగీతం, నేప‌థ్య సంగీతం, సిద్ కెమెరా ప‌నితనం .. సో సోగానే ఉన్నాయి. ఓ పాట కూడా క‌నీసం వినే స్థాయిలో లేదు. చివ‌రి 20 నిమిషాల కోసం మిగ‌తా సినిమాను భ‌రించాలి అనేలా సినిమా బోరింగ్‌గా సాగింది. క‌థ‌, క‌థ‌నం ఆస‌క్తిక‌రంగా ఉండుంటే సినిమా బావుండేది.