నటీనటులు : సందీప్ మాధవ్, సత్య దేవ్, దేవిక, మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, తిరువీర్, అభయ్, తదితరులు.
దర్శకత్వం : జీవన్ రెడ్డి
నిర్మాతలు : అప్పిరెడ్డి, దామోదర రెడ్డి ,సంజయ్ రెడ్డి.
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫర్ : సుధాకర్ యెక్కంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్- అర్జిత్ దత్త.
ఎడిటర్: ప్రతాప్ కుమార్
ఎందరో విద్యార్తులను కదిలించిన వ్యక్తి, అలాంటి ఆదర్శనీయమైన విద్యార్థి నేత జీవితం వెండితెర పై ఆవిష్కృతం అయిన సంగతి తెలిసిందే. గతంలో ‘దళం’ సినిమాతో విబిన్నమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. సందీప్ మాధవ్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ:
‘అమ్మ ఈయన ఎవరు.. భగత్ సింగ్. ఎక్కడున్నారు? చంపేశారు. మళ్లీ రారా?. చావు ఒక్కసారే వస్తుంది’ జార్జిరెడ్డి చిన్నప్పుడు తన తల్లితో జరిపిన సంభాషణలు. చిన్నప్పట్నుంచే భగత్ సింగ్, చెగువేరా పుస్తకాలు చదవడంతో జార్జిరెడ్డికి చైతన్యంతో పాటు కాస్త ఆవేశం ఎక్కువగా ఉంటుంది. తన ముందు అన్యాయం కనిపించినా.. కులం, మతం పేరుతో ఎవరినైనా దూషించినా తట్టుకోలేడు. తెగిస్తాడు. పోరాడతాడు. కత్తిపోట్లు పడినా.. శత్రువులు చంపడానికి వచ్చినా ధైర్యంతో నిలబడి చివరి శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. తనను నమ్ముకున్న వారికోసం చివరి వరకు పోరాడాడు.
జార్జిరెడ్డి పుట్టుక కేరళ.. చదివింది బెంగళూరు, చెన్నైలలో.. విద్యార్థి నాయకుడిగా ఎదిగింది హైదరాబాద్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో. జార్జిరెడ్డి (సందీప్ మాధవ్) చిన్నప్పట్నుంచే చదువులో చురుకుగా ఉండేవాడు. ప్రతీ విషయం శోధించి తెలుసుకోవాలనుకుంటాడు. చదువు, విజ్ఞానంతో పాటు కత్తిసాము, కర్రసాము, బాక్సింగ్‌లో ప్రావీణ్యం పొందాడు. తల్లి(దేవిక) తోడ్పాటు, సహకారంతో జార్జిరెడ్డి అన్ని రంగాల్లో రాటుదేలుతాడు. అయితే ఉన్నత విద్య కోసం యూనివర్సిటీకి రావడంతో అతడి జీవతం పూర్తిగా మారిపోతుంది. అతడి మేధోసంపత్తికి ఆశ్చర్యపడి ఎన్నో ప్రముఖ యూనివర్సిటీలు ఆహ్వానం పలికినా పలు కారణాలతో తిరస్కరిస్తాడు.
అయితే యూనివర్సిటీలో మాయ(ముస్కాన్), దస్తగిరి(పవన్), రాజన్న(అభయ్)లతో జార్జిరెడ్డికి ఏర్పడిన పరిచయం ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? అతడు ఎందుకు యూనివర్సిటీ, సమాజం కోసం పోరాడతాడు? ఓ సమయంలో సొసైటీకి వ్యతిరేకంగా ఎందుకు పోరాడతాడు? ఈ పోరాటంలో సత్య(సత్యదేవ్), అర్జున్(మనోజ్ నందం)లతో అతడికి ఏర్పడిన సమస్యలు ఏమిటి? తన పోరాటంలో జార్జిరెడ్డి విజయం సాధించాడా? ఎందుకు హత్యకు గురవుతాడు? ఇంతకి జార్జిరెడ్డిని ఎవరు హత్య చేస్తారు? అనేదే మిగతా కథ.
విశ్లేషణ:
దళం చిత్రంలో లొంగుబాటు నక్సలైట్స్ సమస్యలను ఆధారం చేసుకుని సినిమా చేసిన జీవన్ రెడ్డి దాదాపు ఆరేళ్ల తర్వాత చేసిన సినిమా `జార్జిరెడ్డి`. ట్రెండ్‌లో భాగంగా ఆసక్తిని కలిగించే కథాంశాన్ని ఎంచుకునే క్రమంలో ఈ సినిమాను చేయడానికి జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నాడో లేక చరిత్రలో జార్జిరెడ్డి అనే గొప్ప విద్యార్థి నాయకుడి హత్య వెనకాల పరిస్థితులను వివరించడానికి ఈ కథను ఎంచుకున్నాడో కానీ.. మొత్తానికి ఆయన అటెంప్ట్‌ను అభినందించాలి. అలాగే సినిమా చేసే క్రమంలో కథకు తగ్గ నటీనటుల ఎంపిక కూడా అవసరమే. ఈ సినిమా విషయానికి వస్తే సినిమాలోని పాత్రలకు సరిపోయేలా నటీనటులను ఆయన ఎంపిక చేసుకున్నారు. ముఖ్యంగా హీరో సందీప్ మాధవ్ విషయానికి వస్తే.. `వంగవీటి` చిత్రంలో వంగవీటి సోదరులు రాధా, రంగాల్లాగానే వారి పాత్రల్లో ఒదిగిపోయిన సందీప్ ఈ సినిమాలో జార్జిరెడ్డి పాత్రలో ఒదిగిపోయారు. పాత్రకు తగ్గట్లు ఆయన నటన ప్రేక్షకులను మెప్పించింది. బాడీలాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ చక్కగా ఉన్నాయి. ఇక జార్జిరెడ్డి తల్లిపాత్రలో నటించిన దేవిక, ఆ పాత్రకు చక్కగా సూట్ అయ్యారు. ఇక హీరోయిన్గా నటించిన ముస్కాన్, రాజన్న అనే స్నేహితుడిగా నటించిన అభయ్, పవన్, సహా కీలక పాత్రలో నటించిన సత్యదేవ్, మనోజ్ నందం తదితరులు వారి పాత్రల్లో అతికినట్లు సరిపోయారు. సాంకేతికంగా చూస్తే 1972 ముందు పరిస్థితులను చక్కటి సెట్స్, లొకేషన్స్‌లో చిత్రీకరించారు. నటీనటులు అప్పటి హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్‌లను చక్కగా ఎలివేట్ చేశారు.
యాక్షన్ సన్నివేశాలను చక్కగా డిజైన్ చేశారు. ఉదాహరణలకు క్యాంపస్ చూపించిన ఫైర్ బాల్ ఫైట్, అలాగే బ్లేడ్ ఫైట్ అన్నీ బావున్నాయి. పాటల విషయానికి వస్తే వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ ..సాంగ్ బావుంది. హీరోయిన్ ముస్కాన్ హీరోపై మనసు పడ్డట్లు చూపించారు కానీ ఎక్కడా వారి లవ్‌ను ఫీల్ అయ్యే సీన్స్ కనపడవు. మరి అలాంటప్పుడు హీరోయిన్ లవ్ ట్రాక్‌ను అంతగా చూపించారో ఏమో డైరెక్టర్‌కే తెలియాలి. అలాగే ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే బయటి ప్రచారంలో ఉన్న జార్జిరెడ్డి కుటుంబ నేపథ్యాన్ని సరిగ్గా ఎలివేట్ చేయలేదా? అనిపిస్తుంది. అలాగే పాత్రలు, వాటి మధ్య ఉన్న ఎమోషన్స్‌ను క్యారీ చేయడంలో దర్శకుడు జీవన్ రెడ్డి మరింత వర్కవుట్ చేసి ఉండాల్సిదనిపిస్తుంది. ఎందుకంటే ఎమోషనల్‌గా ప్రేక్షకుడు ఎక్కడా కనెక్ట్ కాడు. సరే! ఇప్పటి జనరేషన్‌కు, కాలేజీ గొడవల గురించి తెలియవు కదా అని చెప్పవచ్చు. అయితే సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచి ఉండొచ్చు కదా! అనే సందేహం వస్తుంది. అంటే సన్నివేశాలు గ్రిప్పింగ్‌గా అనిపించవు. లింకు కనపడదు.. ఉదాహరణకు ముంబై వెళ్లిపోతానని ఓ భారీ స్పీచ్ ఇచ్చిన జార్జిరెడ్డి తర్వాత ముంబై ఎందుకు వెళ్లలేదు? అనే దానిపై క్లారిటీ కనపడదు. లింకు ఉండదు. అయితే సినిమా విడుదలకు ముందు ఈ సినిమా విడుదలపై కొందరు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు కానీ.. దర్శకుడు జీవన్ రెడ్డి ఎవరి మనో భావాలను కించ పరచకుండా సినిమాను చక్కగా తెరకెక్కించాడు.