నటీనటులు : సత్యదేవ్, ఈషా రెబ్బా, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ, కృష్ణభగవాన్, టెంపర్ వంశీ, అజయ్, అనురాగ్, రవి వర్మ, రవిప్రకాష్, మానిక్ రెడ్డి, అదిరే అభి తదితరులు.

దర్శకత్వం : శ్రీనివాస్ రెడ్డి

నిర్మాత‌లు : శ్రీనివాస్ కానూరు

సంగీతం :  రఘు కుంచె

సినిమాటోగ్రఫర్ : గ‌రుడ‌వేగ అంజి

ఎడిటర్:  తమ్మిరాజు


కెరీర్‌లో ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్‌లు తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డి అప్పుడప్పుడు ఢమరుకం లాంటి ఫాంటసీ డ్రామా, శివమ్‌ లాంటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించాడు. అదే బాటలో ఇప్పుడు మరోసారి రూటూ మార్చి రాగల 24 గంటల్లో అంటూ క్రైమ్‌ థ్రిల్లర్‌ను రూపొందించాడు. ఇటీవల థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో రాగల 24 గంటల్లో ఏ మేరకు ఆకట్టుకుంది.శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలైంది.

కథ:

బంగాళాఖాతంలో ఏర్పడిన తూఫాన్ హెచ్చరికతో, మేఘన(ముస్కాన్ సేథీ) రేప్ అండ్ మర్డర్ కేసులో తప్పించుకున్న ముగ్గురు నిందితుల హెచ్చరికతో రాగల 24 గంటల్లో’ ఏదైనా జరగచ్చు అనే నోట్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే..

ఇండియాలోనే టాప్ మోస్ట్ యాడ్ ఫిల్మ్ మేకర్స్ లో రాహుల్(సత్యదేవ్) ఒకరు. తన సక్సెస్ కోసం ఎలాంటి రిస్క్ అయినా చేయడానికి సిద్దపడే రాహుల్ మొదటిసారి విద్య(ఈషా రెబ్బ)ని చూసి ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లి చేసుకున్నాక తనలోని నెగటివ్ షేడ్స్, పొసెసివ్ నెస్, జాలిదయ లేకుండా తాను చేసే కొన్ని పనులు విద్యకి నచ్చవు. దాంతో ఇద్దరి మధ్యా మనస్పర్థలు వస్తాయి. అదే సమయంలో రాహుల్ అనుమానాస్పదంగా తన ఇంట్లోనే మర్డర్ కి గురవుతాడు. ఇంతకీ ఆ మర్డర్ భార్య అయిన విద్య చేసిందా? లేక ఇంకెవరైనా చేశారా? ఈ కేసు సాల్వ్ చేయడానికి వచ్చిన ఎసిపి నరసింహా(శ్రీరామ్) ఎలా సాల్వ్ చేసాడు? మొదట్లో తప్పించుకున్న ముగ్గురు హంతకులు ఏమయ్యారు? అనేదే కథ.

విశ్లేషణ:

‘అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు లేరు ఈ నాటకంలో’ఈ డైలాగ్‌ కాస్త అటూ ఇటూగా ఈ సినిమాకు సెట్‌ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో హీరోలు అనుకునే వారు మంచి వారు కాదు.. విలన్లు అనుకునే వారు చెడ్డ వారు కాదు. ఇలా విలక్షణమైన స్టోరీ లైన్‌ పట్టుకుని పూర్తి కథను అల్లాడు రచయిత. దీనికి క్రైమ్‌, సస్పెన్స్‌కు తోడు ఫుల్‌ గ్లామర్‌ వడ్డించిన సినిమాను ప్రేక్షకుల ముందు పెట్టాడు దర్శకుడు. కొన్ని ట్విస్టులు ఊహకందవు.. మరికొన్నేమో ఇప్పటికే క్రైమ్‌ స్టోరీ సినిమాలు చూసినవారు ఇట్టే పసిగట్టేస్తారు. ఇక కొన్ని లాజిక్‌ లేని సీన్లతో ప్రేక్షకులు ఆశ్చర్యచకితులవుతారు.

‘రానున్న 24 గంటల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది’అని సినిమా ప్రారంభంలో ఓ న్యూస్‌ ఛానళ్లో న్యూస్‌ రీడర్‌ చదువుతుంది. అక్కడ వినిపించిన, కనిపించిన ‘రానున్న 24 గంటల్లో’ మరోసారి సినిమా మొత్తంలో ఎక్కడా కనిపించదు. అందుకే కథకు టైటిల్‌కు సంబంధం ఎంటో తెలుసుకోవడానికి ఉత్సాహపడిన సగటు ప్రేక్షకుడికి నిరాశే ఎదురువుతుంది. ఇక తన నటన, అందంతో సినిమాకు ప్రాణం పోసింది ఈషా రెబ్బ. సరైన అవకాశం దక్కాలే కాని తన నట విశ్వరూపం ప్రదర్శిస్తానని ఈ సినిమాతో ఈషా రెబ్బ టాలీవుడ్‌ దర్శకనిర్మాతలకు సవాల్‌ విసిరింది. ఆనందం, భయం, కోపం, జాలి, బాధ, శృంగారం ఇలా నవరసాలను ఇషా రెబ్బ అవలీలగా పండించింది. కెమెరామెన్‌ గరుడవేగ అంజి సినిమాను రిచ్‌ లుక్‌లో చూపించాడు. ముఖ్యంగా ఈషా రెబ్బ అందచందాలను చూపించడంలో కెమెరామన్‌ పనితనం సినిమాలో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు మాటలు అందించి, నటించిన కృష్ణ భగవాన్‌ రెండింటిలోనూ తన మార్క్‌ చూపించుకున్నాడు. ‘నాపై ఉన్న ప్రేమను చెప్పడానికి నీకు పదాలు చాలవు.. నాకు గిప్ట్‌ ఇద్దామనుకున్నా నన్ను మించిన గొప్పది నీకు దొరకదు, మనసులో టెన్షన్‌.. ఇంట్లో శవం రెండూ భయంకరమే’ వంటి డైలాగ్‌లు అలరిస్తాయి. సంగీత దర్శకుడు రఘు కుంచె ఇచ్చిన పాటలు ఉన్నంతలో పర్వాలేదనిపిస్తాయి. భాస్కరబట్ల, శ్రీమణిల కలం పనితనం పాటల్లో కనిపిస్తుంది. కాదు వినిపిస్తుంది. ఇక ఎడిటింగ్‌, నిర్మాణ విలువుల సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.