మూవీ: తోలుబొమ్మలాట
జానర్‌: ఫ్యామిలీ డ్రామా
నటీనటులు: రాజేంద్రప్రసాద్‌, విశ్వంత్‌, వెన్నెల కిశోర్‌, హర్షిత, నారాయణరావు, దేవీప్రసాద్‌
సంగీతం: సురేష్‌ బొబ్బిలి
దర్శకత్వం: విశ్వనాథ్‌ మాగంటి
నిర్మాత‌లు : దుర్గాప్రసాద్‌ మాగంటి
ఒక మంచి కధాంశాన్ని ఎంచుకుని, దానికి వినోదాన్ని జోడించి,చివరిగా మనసుకు హత్తుకునే ఒక సందేశాన్ని అందించడం అనేది తోలుబొమ్మలాటకి ఉన్న ప్రత్యేకత.తోలుబొమ్మలాట...ఈ పదం ఇప్పటితరం టీనేజర్స్‌కి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు మాత్రం తోలుబొమ్మలాటకి చాలా ఆదరణ ఉండేది.విశ్వంత్‌ దుద్దుంపూడి, హర్షిత చౌదరి, వెన్నెల కిశోర్‌, దేవీ ప్రసాద్‌, ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని దుర్గాప్రసాద్‌ మాగంటి నిర్మించగా విశ్వనాథ్‌ మాగంటి దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ :
సోడాల రాజు అలియాస్ సోమరాజు (రాజేంద్ర ప్రసాద్) తన గ్రామంలోనే అందరీ మంచి కోరుకునే సుప్రసిద్ధమైన పెద్ద మనిషి. అయితే సోమరాజుకు తన మనవరాలు వర్ష (హర్షిత) మరియు తన మనవడు రిషి (విశ్వంత్‌) పెళ్లి చేసుకోవాలని.. అలాగే తన పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని.. జీవితంలో ఆయన బలంగా కోరుకున్న చివరి కోరిక. సోమరాజు తన కోరికను నెరవేర్చుకునే క్రమంలో కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం అకస్మాత్తుగా సోమరాజు చనిపోతాడు. అయినప్పటికీ ఆ తరువాత మళ్లీ ఒక ఆత్మగా తిరిగి వస్తాడు. కానీ అప్పటికే తన పిల్లల ఆస్తి పై గొడవలు పడుతుంటారు. అలా వారి నిజస్వరూపాలు చూస్తాడు సోమరాజు. అవి చూస్తూ సోమరాజు ఎలాంటి బాధ పడ్డాడు ? తిరిగి తన పిల్లలను ఎలా మార్చాలకున్నాడు ? దాని కోసం ఏమి చేశాడు ? ఎవరి సహాయం తీసుకున్నాడు ? చివరికీ సోమరాజూ పిలల్లు మారారా ? లేదా ?

నటీనటులు:
రాజేంద్ర ప్రసాద్ నటనకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. సోడాల రాజు కారెక్టర్ కూడా ఆయనకు కొట్టిన పిండే. సినిమాలో చాలా చోట్ల ఎమోషనల్ టచ్ ఇచ్చాడు రాజేంద్రుడు. విశ్వంత్ బాగా చేసాడు. హర్షితా చౌదరి కూడా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది.

విశ్లేషణ:
ఆ నలుగురు, మీ శ్రీయోభిలాషి, ఓ బేబీ వంటి డిఫరెంట్‌ కథలతో ప్రతీ ఒక్కరి హృదయాలను కదిలించేలా, అందరినీ ఆలోచింప చేసేలా చేసిన రాజేంద్రప్రసాద్‌ మరోసారి అలాంటి జానర్‌తోనే ప్రేక్షకుల తలుపు తట్టాడు. ఇలాంటి చిత్రాలు ఆడియన్స్‌కు కనెక్ట్‌ కావాలంటే కథా బలం ముఖ్యం. లేదంటే మామూలు కథైనా చాలా బలంగా చెప్పాలి. ఎమోషనల్‌గా అందరినీ టచ్‌ చేయాలి. ఈ సినిమాకు కథే హీరో. అయితే దర్శకుడు మంచి స్టోర్‌ లైన్‌ ఎంచుకున్నప్పుటికీ.. పూర్తి స్టోరీగా మల్చడంలో తడబడ్డాడు. ఏం చేయాలో తెలియక ‘ఆ నలుగురు’ ఫార్మట్‌ను ప్రయోగించాడు. దీంతో ఒకసారి చూసిన సినిమాను మరోసారి రిపీట్‌ చేసి చూసినట్టుంది. కుటుంబ కథా చిత్రాలకు ఎమోషన్స్‌ ముఖ్యం. ఈ విషయంలో కొత్త దర్శకుడి అనుభవలేమి సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది.

హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్‌ సీన్లు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. కథను ముందుకు తీసుకెళ్లడానికి దర్శకుడు అనేక ఇబ్బందులు పడ్డాడు. పలుమార్లు అనవసర, అసందర్బ సీన్లు తెరపై కనిపించడం ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తుంది. ఇక కుటుంబ కథా చిత్రాలకు మాటలు ముఖ్యం. ఎందుకంటే ‘శతమానంభవతి’ సినిమాలో వచ్చే ప్రతీ డైలాగ్‌ను ఆడియన్స్‌ ఎంత ఎంజాయ్‌ చేశారో తెలిసిందే. కానీ ఈ సినిమాలో అలాంటి పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు వేళ్లపై లెక్కపెట్టోచ్చు. పాటలు పర్వాలేదనిపించినా.. సాహిత్య విలువలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక కెమెరా పనితనం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.