ప్రముఖ గాయనీ మంగ్లీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం స్వేచ్ఛ. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కెపీఎన్ చౌహన్ దర్శకత్వంలో సరస్వతి డెవలపర్స్, లచ్చురాం ప్రొడక్షన్స్ పతాకంపై ఆంగోత్ రాజునాయక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ తండా స్థాయి నుండి ప్రపంచస్థాయి వరకు గాయనిగా ఎదిగిన మంగ్లీ ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రను పోషించింది. ఆమె పాత్ర నేటి అమ్మాయిలకు ఎంతో ప్రేరణగా నిలుస్తుంది. సెంటిమెంట్, వినోదం మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది. పాపికొండలతో పాటు పలు అందమైన లోకేషన్లలో చిత్రీకరణ చేశాం. ఈ నెల 22న పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. ఈ సినిమాలోని ప్రతి పాటలో మా టీమ్‌లో ఎంతో పాజిటివ్ ఎనర్జీని నింపింది. ఈ చిత్రంలో ఒక మంచి పాత్రలో నటించడంతో పాటు సంగీతం అందించడం ఆనందంగా వుందని భోలో షావలి తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంత ముఖ్యమో, ఈ సృష్టికి ఆడ పిల్లలు అంతే ముఖ్యమని తెలిపే చిత్రమిది. ఆడపిల్లలను పురిటిలోనే చంపకుండా వారిని చదివించి, ప్రయోజకులు చేస్తే ఏ రంగంలో వాళ్లు తీసిపోరనే అద్భుతమైన కథాంశమిది. ప్రస్తుతం సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న కొన్ని సంఘటనలను ప్రేరణగా తీసుకుని తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు అందరి మనసుకు హత్తుకునే విధంగా వుంటాయి.మంగ్లీ నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. హాస్య నటుడు చమ్మక్ చంద్ర ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటించాడు అని తెలిపారు.