నటీనటులు :  శ్రీ సింహ, సత్య, వెన్నెల కిషోర్, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ తదితరులు

దర్శకత్వం : రితేష్ రాణా

నిర్మాత‌లు : చిరంజీవి(చెర్రీ), హేమలత

సంగీతం :  కాల భైరవ

సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేసిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కాగా ఈ సినిమాకి కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.


క‌థ‌:

బాబు(శ్రీసింహ‌), యేసు(స‌త్య‌), అభి(న‌రేష్ అగ‌స్త్య‌) ముగ్గురు స్నేహితులు. వీరిలో బాబు, యేసు ఓ ఆన్‌లైన్ సంస్థ‌లో డెలివ‌రీ బాయ్స్‌గా ప‌నిచేస్తుంటారు. అభి ఖాళీగా ఉంటూ ఇంట‌ర్‌నెట్‌లో సినిమాల‌ను డౌన్ పెట్టుకుని చూస్తుంటాడు. బాబు, యేసుల‌కు వ‌చ్చే జీతాలు చాలీ చాల‌క ఇబ్బందులు ప‌డుతుంటారు. ఆ స‌మ‌యంలో యేసు, డెలివ‌రీ చేసే స‌మ‌యంలో క‌స్ట‌మ‌ర్స్‌ను ఎలా మోసం చేయాలో చెబుతాడు. ఆ ఐడియాను పాటించాల‌ని నిర్ణ‌యించుకున్న బాబు ఓ ఇంటికి ఓ వ‌స్తువును డెలివ‌రీ చేయ‌డానికి వెళ‌తాడు. అక్క‌డ జ‌రిగిన చిన్న త‌ప్పు వ‌ల్ల ఓ ముస‌లావిడ చనిపోతుంది. బాబు మ‌త్తులో ప‌డిపోతాడు.

 

బాబు నిద్ర లేచి చూసే స‌రికి అక్క‌డొక శ‌వం ఉంటుంది. అక్కడ నుండి బాబు రూమ్‌కి వ‌చ్చేస్తాడు. త‌ను తీసుకొచ్చిన డెలివ‌రీ బ్యాగ్‌లో 50 ల‌క్ష‌ల రూపాయ‌లు డ‌బ్బులంటాయి. అస‌లు ఆ డ‌బ్బులు ఎక్క‌డి నుండి వ‌చ్చాయో అర్థం కాదు. క్ర‌మంగా బాబుకి విష‌యాలు గుర్తుకు రావ‌డం మొద‌ల‌వుతాయి. మ‌ళ్లీ అదే అపార్ట్‌మెంట్స్‌కి వెళ‌తాడు. నిజంగానే అక్క‌డ మ‌ర్డ‌ర్ జ‌రిగిందా? అస‌లు బాబు ఎందుకు మ‌త్తులోకి వెళ్లిపోతాడు? బాబు చూసిన శ‌వం ఎవ‌రిది? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

విశ్లేషణ: 

ప్రస్తుతం ఈ పద్య భావాన్ని మ్యూజిక్‌డైరెక్టర్‌ ఎమ్‌ఎమ్‌ కీరవాణి పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒకే చిత్రంతో తన ఇద్దరు కుమారులు టాలీవుడ్‌ అరంగేట్రం చేసి ఆకట్టుకున్నారు. మెప్పించారు. ప్రశంసలు అందుకుంటున్నారు. దీంతో కీరవాణి కుటుంబం డబుల్‌ హ్యాపీ అని చెప్పవచ్చు. నటుడిగా శ్రీసింహా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కాల భైరవలు తమ తొలి సినిమాతో రాజమౌళి కుటుంబానికి ఎలాంటి మచ్చ తీసుకరాలేదు. వీరిద్దరితో ఆ కుటంబం కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 


ఇక ఈ సినిమాకు ప్రధాన బలం కథ, కథనం. ఈ రెండు విషయాల్లో చిత్ర యూనిట్‌ ముఖ్యంగా దర్శకుడు ఎక్కడా తడబడలేదు. తెర మీద ఆట ప్రారంభమైన 15 నిమిషాల్లోనే సినిమా నేరుగా అసలు కథలోకి ప్రవేశిస్తుంది. సస్పెన్స్‌, థ్రిల్లర్‌, కామెడీ ఈ మూడు అంశాలను ప్రధానంగా తీసుకుని కథ ఎక్కడా డీవియేట్‌ కాకుండా డైరెక్టర్‌ జాగ్రత్తలు తీసుకున్నాడు. నెక్ట్స్‌ ఏం జరుగుతుంది అనే ఉత్సాహం, ఆసక్తి సగటు ప్రేక్షకుడికి కలిగించడంతో పాటు ఆరోగ్యకరమైన కామెడీ అందించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. కమర్షియల్‌ హంగుల జోలికి పోకుండా కథానుగుణంగా సినిమాను ముందుకు నడింపించాడుదర్శకుడు రితేష్‌ రానా. క్లైమాక్స్‌ వరకు కూడా సస్పెన్స్‌ను రివీల్‌ కాదు. అంతేకాకుండా ఎవరి ఊహకందని కామెడీ క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. 

 

 సంగీతదర్శకుడిగా మరో అవతారం ఎత్తిన సింగర్‌ కాల భైరవ తన తొలి సినిమాలోనే తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశాడు. ఈ మూవీకి మరో మేజర్‌ ప్లస్‌ పాయింట్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌. సినిమాలో వచ్చే ప్రతీ సిచ్యూవేషన్‌కు తగ్గట్టు వినూత్న రీతిలో కొత్త బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించాడు ఈ యువ సంగీత దర్శకుడు. ముఖ్యంగా కామెడీగా వచ్చే కొన్ని సౌండ్స్‌ కేక అని చెప్పాలి. ఇక దర్శకుడు ఆలోచనలను తెరమీద దృశ్యరూపంలో ఎలాంటి గందరగోళం లేకుండా చాలా చక్కగా ప్రజెంట్‌ చేశాడు సినిమాటోగ్రఫర్‌. విజువలైషన్స్‌ కూడా చాలా కొత్తగా వండర్‌గా అనిపిస్తుంది. ఎడిటింగ్‌, నిర్మాణవిలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. 

ఇక ఒక్క మాటలో చెప్పాలంటే కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా సూపర్బ్‌గా నచ్చుతుంది. వినూత్న కథలను, కొత్త కాన్సెప్ట్‌లను ఎల్లప్పుడూ ఎంకరేజ్‌ చేసే తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా రిసీవ్‌ చేసుకుంటారో వేచి చూడాలి. ఫైనల్‌గా కొత్త వాళ్లు.. కొత్త ప్రయత్నం.. కొత్తగా, గ‘మ్మత్తు’గా ఉంది.