నటీనటులు: రజనీకాంత్ - నయనతార - సునీల్ శెట్టి - నివేథా థామస్ - ప్రతీక్ బబ్బర్ - యోగిబాబు - జ్యోతి సర్నా - నవాబ్ షా తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: సంతోష్ శివన్
నిర్మాత: సుభాస్కరన్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మురుగదాస్.

సూపర్ స్టార్ రజినీకాంత్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన చిత్రం ‘దర్బార్’. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్‌గా నటించిన ఈ చిత్రంలో నివేద థామస్, నయనతార, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.
కథ:
ముంబై పోలీసు కమిషనర్‌ అయిన ఆదిత్య అరుణాచలం (రజనీకాంత్‌) ఒక్కసారిగా ఆవేశానికిలోనై.. రౌడీలను, గ్యాంగ్‌స్టర్‌లను విచ్చలవిడిగా కాల్చిచంపుతుంటాడు. అతని ఎన్‌కౌంటర్లపై విచారణ జరపడానికి వచ్చిన మానవహక్కుల కమిషన్‌ సభ్యులను కూడా బెదిరిస్తాడు. ఏదైనా పని చేపడితే.. దానిని కంప్లీట్‌గా క్లీన్‌ చేసే వరకు వదిలిపెట్టని ఆదిత్య అరుణాచలం ముంబైలో డ్రగ్స్‌, హ్యుమన్‌ ట్రాఫికింగ్‌ గ్యాం‍గ్‌లను ఏరివేసే క్రమంలో కిరాతకుడైన విక్కీ మల్హోత్రా కొడుకు అజయ్‌ మల్హోత్రాను అరెస్టు చేస్తాడు. ఆదిత్య అరుణాచలం వ్యూహాలతో అనూహ్య పరిస్థితుల నడుమ జైల్లోనే అజయ్‌ హతమవ్వాల్సి వస్తోంది. దీంతో డ్రగ్‌లార్డ్‌, మొబ్‌స్టర్‌ అయిన హరిచోప్రా (సునీల్‌ శెట్టి) ప్రతీకారానికి తెగబడతాడు. ఆదిత్య కూతురితోపాటు విక్కీని కూడా చంపుతాడు. అతనెందుకు ఈ హత్యలు చేశాడు. గతంలో పోలీసులను సజీవదహనం చేసి ముంబై పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసిన హరిచోప్రా అసలు ఎవరు? ఈ చిక్కుముడులను ఆదిత్య అరుణాచలం ఎలా విప్పాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నది మిగతా కథ.

విశ్లేష‌ణ‌:
 ర‌జినీకాంత్ `రోబో` త‌ర్వాత నాలుగు సినిమాలు విడుద‌లైన‌ప్ప‌టికీ ఏవీ అనుకున్న స్థాయిలో విజ‌యాల‌ను సాధించ‌లేక‌పోయాయి. దీంతో ర‌జినీకాంత్ ఓ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుని, స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్‌తో క‌లిసి చేసిన సినిమాయే ద‌ర్బార్‌. మురుగ‌దాస్ గ‌త చిత్రం స్పైడ‌ర్ కూడా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ కావడంతో ఆయ‌న కూడా శ్ర‌ద్ధ పెట్టే చేసుంటాడు అనేలా సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నాయి. అప్పుడెప్పుడో ప‌క్కా పోలీస్ క్యారెక్ట‌ర్‌లో అల‌రించిన ర‌జినీకాంత్ చాలా కాలం త‌ర్వాత చేసిన పోలీస్ ఆఫీస‌ర్ సినిమా ఇది. ఆయ‌న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మురుగ‌దాస్ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ద‌ర్బార్ సినిమాను తెర‌కెక్కించారు. ర‌జినీకాంత్ సోలో పెర్ఫామెన్స్‌తో సినిమాలో అంతా తానై క‌నిపించాడు. హీరోయిన్‌గా చేసిన న‌య‌న‌తార‌, కూతురుగా చేసిన నివేదా థామ‌స్ వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు. సెకండాఫ్ అంతా మెయిన్ విల‌న్ సునీల్ శెట్టి, హీరో ర‌జినీకాంత్ మ‌ధ్య‌నే ఎక్కువ భాగం సాగుతుంది. ప్ర‌తీక్ బబ్బ‌ర్‌, న‌వాజ్‌షా, యోగిబాబు ఉన్నంత‌లో కామెడీతో న‌వ్వించే ప్రయ‌త్నం చేశాడు. ర‌జినీ ల‌వ్‌ట్రాక్‌కు ఓ రీజ‌న్ పెట్..టి దాన్ని ర‌న్ చేయ‌డంతో మ‌న‌కు ఓకే అనిపిస్తుంది. టోట‌ల్ క‌థ ప‌రంగా చూస్తే ఇదొక రివేంజ్ డ్రామా. అస‌లు ఆ ప్ర‌తీకారం ఎవ‌రు ఎవ‌రి మీద‌, ఎందుకు తీర్చుకున్నార‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక టెక్నీషియ‌న్స విష‌యానికి వ‌స్తే మురుగ‌దాస్ సూప‌ర్‌స్టార్‌ను సూప‌ర్‌మ్యాన్‌లా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. కొన్ని స‌న్నివేశాలు అతిశ‌యోక్తి అనిపించినా క‌మ‌ర్షియ‌ల్ ఇమేజ్‌లో కొట్టుకుపోతాయ‌నుకోవాలేమో.
 
సినిమాలో ర‌జినీకాంత్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్ సింప్లీ సూప‌ర్బ్‌. మాస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునే స్టైల్లో రామ్‌ల‌క్ష్మ‌ణ్ ఫైట్‌ను డిజైన్ చేశారు. ఇక ఫైట్స్, మాస్ సీన్స్ వ‌చ్చే స‌మ‌యంలో బ్యాక్‌గ్రౌండ్ వ‌చ్చే తలైవా అనే సౌండ్ అభిమానుల‌కు ఇంపుగా ఉంటుందన‌డంలో సందేహం లేదు. ఇక న‌వాజ్ షా, ప్ర‌తీక్ బబ్బ‌ర్‌, ర‌జినీకాంత్ మ‌ధ్య న‌డిచే క్యాట్ అండ్ మౌస్ సీన్స్ ఆక‌ట్టుకుంటాయి. అందులో స‌న్నివేశాల ప‌రంగా కొన్ని డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి. ర‌జినీ కాంత్ విల‌న్‌ని ఇబ్బంది పెడుతూనే సెటైరిక‌ల్‌గా మాట్లాడే స‌న్నివేశాలు బావుంటాయి. ఇక మెయిన్ విల‌న్ ఎంట్రీ ఇంట‌ర్వెల్‌లోనే ఉంటుంది. విల‌న్ వ‌చ్చిన త‌ర్వాత హీరో మీద ఎటాక్ చేసి మైండ్ గేమ్ ఆడ‌టం.. అప్పుడే ర‌జినీకాంత్ పాత్ర దాన్ని తెలివిగా ఎదుర్కొని విల‌న్‌ని ఎలా బుద్ధి చెబుతుంద‌నేదే సినిమా. ఈ అంశాల‌న్నింటినీ ఓ ప‌క్కా మెథ‌డ్‌లో మురుగ‌దాస్ సెట్ చేశాడు. ఇక సినిమాను అనిరుధ్ త‌న సంగీతంతో నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాడు. సంతోశ్ శివ‌న్ కెమెరా ప‌నిత‌నం బావుంది. ఎడిటింగ్ బావుంది. టెక్నిక‌ల్‌గా సినిమా బావుంది. అనిరుధ్ పాట‌లు తెలుగు ఆడియెన్స్‌కు పెద్ద‌గా క‌నెక్ట్ కావు. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.