నటీనటులు :  మహేష్ బాబు, విజయ శాంతి, రష్మిక మందాన, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, రావు రమేష్, సంగీత తదితరులు

దర్శకత్వం : అనిల్ రావిపూడి

నిర్మాత‌లు : రామ బ్రహ్మం సుంకర

సంగీతం :  దేవిశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫర్ : రత్నవేలు

ఎడిటర్:  తమ్మిరాజు

సూపర్‌ స్టార్‌ మహేష్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా రాక కోసం సూపర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఈ చిత్రం ఈ రోజు అత్యధిక థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ ను ఏ మేరకు మెప్పించిందో.

క‌థ‌:

ఆర్మీ మేజ‌ర్ అజ‌య్ కృష్ణ (మ‌హేశ్‌) స‌రిహ‌ద్దుల్లో తీవ్ర‌వాదుల‌తో పోరాడుతూ దేశాన్ని కాపాడుతుంటాడు. అదే రెజిమెంట్‌లోకి అదే పేరుతో మ‌రో వ్య‌క్తి(స‌త్య‌దేవ్‌) జాయిన్ అవుతాడు. ఓ టెర్ర‌రిస్ట్ ఎటాక్‌లో అజ‌య్(స‌త్య‌దేవ్‌) బాగా గాయ‌ప‌డ‌తాడు. అత‌ను త్వ‌ర‌లోనే చ‌నిపోతాడు కాబ‌ట్టి ఆ విష‌యాన్ని అత‌ని కుటుంబానికి చెప్పడానికి ఆర్మీ నిర్ణ‌యించుకుంటుంది. అజ‌య్ త‌ల్లి భార‌తి(విజ‌య‌శాంతి) మెడిక‌ల్ కాలేజ్ ప్రొఫెస‌ర్‌. చిన్న త‌ప్పును కూడా భ‌రించ‌ని వ్య‌క్తి త‌న పెద్ద‌కొడుకు ఆర్మీలో చ‌నిపోయిన‌ప్ప‌టికీ చిన్న‌కొడుకు ఆర్మీకి పంపుతుంది. కొన్ని విలువ‌ల ప్ర‌కారం భార‌తి చెల్లెలి పెళ్లి చేయ‌డానికి అత‌ని స్థానంలో మేజ‌ర్ అజ‌య్ కృష్ణ‌, ప్ర‌సాద్‌(రాజేంద్ర ప్ర‌సాద్‌)తో క‌లిసి క‌ర్నూలు బ‌య‌లుదేరుతాడు. ట్రెయిన్‌లో సంస్కృతి(ర‌ష్మిక‌).. కుటుంబంతో క‌లిసి ప్ర‌యాణిస్తుంటుంది. సంస్కృతికి వాళ్ల నాన్న‌(రావు ర‌మేశ్‌) ఇష్టం లేని పెళ్లి చేయాల‌నుకుంటాడు. అదే స‌మ‌యంలో ఆమె మేజ‌ర్ అజయ్‌ని చూసి ప్రేమిస్తుంది. అత‌న్ని పెళ్లి చేసుకోవాల‌ని ఆశ‌ప‌డి, ఎన్నెన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంది. వారి నుండి త‌ప్పించుకుని అజ‌య్ క‌ర్నూలు చేరుకుంటాడు. అక్క‌డ భార‌తి, వాళ్ల కుటుంబం క‌న‌ప‌డ‌దు. ఆమెను మంత్రి నాగేంద్ర‌(ప్ర‌కాశ్ రాజ్‌) చంప‌డానికి ప్రయ‌త్నిస్తుంటారు. వారి బారి నుంచి భార‌తిని ఆమె కుటుంబాన్ని కాపాడుతాడు మేజ‌ర్ అజ‌య్ కృష్ణ‌. అస‌లు నాగేంద్ర‌తో భార‌తికి ఉన్న స‌మ‌స్యేంటి? ఆమెను నాగేంద్ర ఎందుకు చంపాల‌నుకుంటాడు? మేజ‌ర్ అజయ్ కృష్ణ‌.. భార‌తి స‌మ‌స్య‌ను ఎలా తీర్చాడు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

విశ్లేషణ: 

పక్కా కమర్షియల్‌ సినిమాలు తీస్తూ.. వరుస హిట్స్‌ అందుకుంటున్న అనిల్‌ రావిపూడి మరోసారి పూర్తిగా తన ఫార్మెట్‌లోనే ‘సరిలేరు నీకెవ్వరు’ను తీశాడు. తన సినిమాల్లో ఉండే అన్ని దినుసులు ఈ సినిమాలోనూ జోడించాడు. హీరో-హీరోయిన్లతో కామెడీ చేయించడం,  క్యాచీ పదాలు, పంచ్‌ డైలాగులతో ఇలా తనకు తెలిసిన అన్ని మాస్‌-మసాలా అంశాలు సినిమాలో ఉండేలా చూసుకున్నాడు. ఈ విషయంలో ఫస్టాప్‌ వరకు సక్సెస్‌ అయిన డైరెక్టర్‌.. సెకండాఫ్‌ వచ్చేసరికి ఎప్పటిలాగే కథను లైట్‌గా తీసుకున్నాడనే అభిప్రాయం కలుగుతుంది. సెకండాఫ్‌లో భారతి ఎందుకు కష్టాల్లో పడిందనే అంశాన్ని అంత గ్రిప్పింగ్‌గా, స్ట్రాంగ్‌గా అనిల్‌ చెప్పలేకపోయాడు. ఈ సినిమాలో జోడించిన మర్డర్‌ మిస్టరీ ఇన్వేస్టిగేషన్‌, దాని వెనుక ఉన్న నాగేంద్ర కరప్షన్‌ ఇలాంటి అంశాలు కొత్తగా ఉండకపోగా.. రోటిన్‌ అనిపించి బోర్‌ కొడతాయి. సెకండాప్‌ మొదట్లోనే ప్రకాశ్‌ రాజ్‌ను మహేశ్‌ ఢీకొనడంతో.. విలన్‌ పాత్ర వీక్‌ అవుతోంది.

అయితే, కథపై అంతగా శ్రద్ధపెట్టకపోయినా.. ఎప్పటిలాగే కామెడీ, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసే అంశాలపై అనిల్‌ ఫోకస్‌ చేశాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్‌కు నివాళులర్పించే సీన్‌, తల్లి (విజయశాంతి) భావోద్వేగం కంటతడి పెట్టిస్తాయి. డైలాగులు అక్కడక్కడ పేలి.. ప్రేక్షకులతో ఈల వేయించినా.. కొన్ని డైలాగుల రిపిటేషన్‌ కనిపిస్తుంది. మరికొన్నిసార్లు క్యాచీ వర్డ్స్‌ను ఫోర్స్‌డ్‌గా పెట్టినట్టు అనిపిస్తోంది. ఇక, సీఎం, మంత్రులను బంధించి.. హీరో లెంగ్తీ లెక్చర్‌ ఇవ్వడం బాగానే ఉన్నా.. మరీ అవుట్‌ ఆఫ్‌ లాజిక్‌ అనిపిస్తోంది. కథ పెద్దగా లేకపోయినా.. ఇలాంటి అంశాలు, భారీ భారీ డైలాగులతో సెంకడాఫ్‌ను మరీ లెంగ్తీగా చేసిన ఫీలింగ్‌ కలుగుతోంది. అయితే, మహేశ్‌ ఫ్యాన్స్‌ ఎంటర్‌టైన్‌ చేసే అంశాలు ఉండటం, యాక్షన్‌పార్ట్‌ నీట్‌గా బాగుండటం, దేవీశ్రీ ప్రసాద్‌ ఇచ్చిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు ప్లస్‌ కావడంతో ఈ సంక్రాంతి సీజన్‌లో ఇది సూపర్‌స్టార్‌ అభిమానులు అలరించే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశముంది. సినిమాటోగ్రఫీ చక్కగా ఉండటంతోపాటు సినిమా నిర్మాణ విలువలు రిచ్‌ ఉన్నాయి. అయితే, ఎడిటింగ్‌ విషయంలో మరింత కత్తెరవేసి.. క్రిస్ప్‌గా ప్రజెంట్‌ చేస్తే బాగుండేదన్న ఫీలింగ్‌ రాకపోదు.