నటీనటులు :  అల్లు అర్జున్, పూజా హెగ్డే, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు,సముద్ర ఖని,సచిన్, జయరాం, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, హర్ష,బ్రహ్మాజీ, సునీల్ తదితరులు

దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్

నిర్మాత‌లు : అల్లు అరవింద్, ఎస్ రాధా కృష్ణ

సంగీతం :  ఎస్ ఎస్ థమన్

సినిమాటోగ్రఫర్ : పి ఎస్ వినోద్

ఎడిటర్:  నవీన్ నూలి


అల్లు అర్జున్... కెరీర్లో బాగా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ‘అల వైకుంఠపురములో’. ‘జులాయి’ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత అతను త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ఈ రోజే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఆ అంచనాల్ని ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.


క‌థ‌:

రామ‌చంద్ర‌(జ‌య‌రాం) కోటీశ్వ‌రుడు. త‌న ద‌గ్గ‌ర ప‌నిచేసే వాల్మీకి(ముర‌ళీశ‌ర్మ‌)కి ఒకేసారి అబ్బాయిలు పుడ‌తారు. అయితే రామ‌చంద్ర‌పై ఉన్న ద్వేషంతో, అసూయ‌తో వాల్మీకి త‌న బిడ్డ‌ను అత‌ని కొడుకు స్థానంలోకి, అత‌ని కొడుకుని త‌న బిడ్డ స్థానంలోకి మార్చేస్తాడు.  సాక్ష్యంగా ఉన్న నర్స్ ప్ర‌మాదం కార‌ణంగా కోమాలోకి వెళ్లిపోతుంది.  ముర‌ళీశ‌ర్మ త‌న కొడుకు బంటు(అల్లు అర్జున్‌)ని మ‌ధ్య త‌ర‌గ‌తి వ్య‌క్తిగానే పెంచుతాడు. అల వైకుంఠ‌పుర‌ములోని రామచంద్ర దంప‌తులే త‌ల్లిదండ్రుల‌ని చెప్ప‌కుండా, దాదాపు వారిని క‌ల‌వ‌నీయ‌కుడా చూస్తాడు. 20 ఏళ్ల త‌ర్వాత బంటుకి అస‌లు నిజం తెలుస్తుంది. అప్పుడు త‌నేం చేస్తాడు? త‌న త‌ల్లిదండ్రుల‌ను చేరుకుంటాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా తెర‌పై చూడాల్సిందే...

విశ్లేషణ: 

సినిమా ఆరంభం నుంచి దర్శకుడు, హీరో చెప్పిన ఒకే మాట. సరదాగా ఓ సినిమా తీద్దాం అనుకున్నాం.. అలాగే తీశాం అని చెప్పారు. వారు చెప్పింది అక్షరాల నిజమని సినిమా చూస్తే అర్థమవుతుంది. భారీ చేజింగ్‌లు, పోరాట సన్నివేశాలు, కథలో ఊహించని మలుపులు అంటూ పెద్దగా ఏమీ కనిపించవు. కానీ పంచభక్ష పరమాన్నాలు వడ్డించిన విస్తరిలా నిండుగా, అందంగా ఈ సినిమా ఉంటుంది. త్రివిక్రమ్‌ మార్క్‌​ టేకింగ్‌.. అల్లు అర్జున్‌ కామెడీ టైమింగ్‌, యాక్టింగ్‌, డ్యాన్స్‌లు, పాటలు సింపుల్‌గా చెప్పాలంటే సినిమా సరదా సరదాగా, ఎక్కడా బోర్‌ కొట్టకుండా సాఫీగా సాగుతూ వెళ్తుంది.

అయితే సినిమా మొదలైన కొద్ది నిమిషాల్లోనే కథేంటో సగటు ప్రేక్షకుడికి అర్థమవుతుంది. అయితే కథ ముందే చెప్పేసి దాదాపు మూడు గంటల పాటు ప్రేక్షకుడిని కుర్చీలోంచి లేవకుండా చేయడంలో త్రివిక్రమ్‌ సక్సెస్‌ అయ్యాడు. కథ ముందే తెలిసినా తర్వాత ఏం జరుగుతుంది అనే ఆసక్తి సగటు ప్రేక్షకుడికి కలిగేలా స్క్రీన్‌ ప్లే ఉంటుంది. ఇక కథలో ఎలాంటి కొత్త దనం లేనప్పటికీ త్రివిక్రమ్‌పై నమ్మకంతో సినిమాకు అంగీకరించిన బన్ని గట్స్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. ఎందుకంటే గ్యాప్‌ తర్వాత వచ్చే సినిమా హిట్‌ సాధించాలి కానీ ఇరిటేట్‌ చేయకూడదు. అయితే బన్ని నమ్మకాన్ని త్రివిక్రమ్‌ నూటికి నూరుశాతం నిలబెట్టాడు.