నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్ - మెహ్రీన్ కౌర్ - విజయ్ కుమార్ - సుమిత్ర - తనికెళ్ల భరణి - పవిత్ర లోకేష్ - రాజీవ్ కనకాల - శరత్ బాబు - సుహాసిని-వెన్నెల కిషోర్ - నరేష్ - సుదర్శన్ తదితరులు
సంగీతం: గోపీ సుందర్
ఛాయాగ్రహణం: రాజ్ తోట
నిర్మాతలు: ఉమేష్  గుప్తా - సుభాష్ గుప్తా - శివలెంక కృష్ణప్రసాద్
రచన-దర్శకత్వం: సతీశ్ వేగేశ్న
నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ తొలిసారి న‌టించిన కుటుంబం క‌థా చిత్రం `ఎంత మంచివాడ‌వురా`. గుజరాతీ సినిమాకు ఇది రీమేక్‌. జాతీయ అవార్డు ద‌క్కించుకున్న శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాన్ని తెర‌కెక్కించిన దర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. పిల్ల‌ల‌కు దూరంగా ఉండే త‌ల్లిదండ్రుల మాన‌సిక వేద‌న‌ను శ‌త‌మానం భ‌వ‌తిలో..., పెళ్లి ప్రాముఖ్య‌త గురించి శ్రీనివాస క‌ల్యాణం చిత్రంలో చూపించిన ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న ఈ సినిమాతో ఏం చెప్పాల‌నుకున్నారు.

కథ:
బాలు(కళ్యాణ్‌ రామ్‌)కు బంధాలు, బంధుత్వాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు బర్త్‌డే కానుకగా చుట్టాలందిరినీ పిలిచి పండగ టైప్‌లో ఎంజాయ్‌ చేయాలని తన తండ్రిని బాలు కోరుతాడు.  ఎందుకంటే చుట్టాలంటే తనకు ఇష్టమని పేర్కొంటాడు. అయితే సంతోషంగా సాగుతున్న బాలు కుటుంబంలో పెద్ద ఉపద్రవం వచ్చి పడుతుంది. ఓ రోడ్డు ప్రమాదంలో బాలు తల్లిదండ్రులు చనిపోతారు. ఈ సమయంలో నా అనుకున్న బంధువులు బాలు చేతిలో జాలిగా ఏమైనా కొనుకొమ్మని డబ్బులు పెడతారే తప్ప చేయందించి తామున్నామనే భరోసా ఇవ్వరు. ఈ తరుణంలో నందిని (మెహరీన్‌)కి బాలుతో పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరు పెరిగి పెద్దాయ్యాక షార్ట్‌ ఫిలిమ్స్‌ తీస్తుంటారు. 
అయితే బాలు తన స్నేహితుల దగ్గర ఓ విషయాన్ని దాచిపెడతారు. అయితే ఈ విషయం నందినికి, బాలు ఫ్రెండ్స్‌కు తెలియడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే ఆ కారణం తెలుసుకొని వారికి అసలు విషయం చెప్పి వారి దగ్గర ఓ ప్రపోజల్‌ పెడతాడు. అక్కడి నుంచి అసలు కథ, ఎమోషన్స్‌ మొదలవుతాయి. అయితే ఈ కథలోకి మిగతా తారాగణం ఎందుకు ఎంటరవుతుంది? ఇంతకీ ఆచార్య, రిషి, సూర్య, శివ, బాలు అందరూ ఒక్కటేనా లేక వేరువేరా? స్నేహితుల దగ్గర బాలు పెట్టిన ప్రపోజల్‌ ఏంటి? అది సత్ఫలితాన్ని ఇచ్చిందా? లేక ఏమైనా ఇబ్బందులు పడ్డారా? అనేదే అసలు సినిమా కథ

విశ్లేష‌ణ‌:
బంధువులు, బంధుత్వాలు మ‌న‌లోని బాధ‌ను, ఒంట‌రిత‌నాన్ని దూరం చేస్తారు. అనే ఓ పాయింట్‌ను తీసుకుని ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న తెర‌కెక్కించిన చిత్ర‌మే `ఎంత‌మంచివాడ‌వురా`. గ‌తంలో ఈ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన శ‌త‌మానం భ‌వ‌తి జాతీయ స్థాయి అవార్డు ద‌క్కించుకుంది. ఈ చిత్రంలో త‌ల్లిదండ్రుల‌ను కొడుకులు విడిచిపెట్టి విదేశాల్లోనే ఉంటే వారు ప‌డే మాన‌సిక బాధ‌ను చూపించాడు. త‌ర్వాత `శ్రీనివాస‌క‌ల్యాణం` చిత్రంలో పెళ్లి గొప్ప‌త‌నాన్ని చెప్పిన స‌తీశ్‌.. ఈసారి ఒంటిరిగా ఉండేవాళ్లు, వాళ్ల మ‌న‌సులోని బాధ‌ను దూరం చేసుకోవ‌డానికి బంధాలు కావాల‌నుకున్న‌ప్పుడు అలాంటి బంధాల‌ను క‌ల్పిస్తే ఎలా ఉంటుంది. మ‌న చుట్టూ ఉన్న‌వారిని న‌వ్వుతూ ప‌ల‌క‌రించాలి.. బంధుత్వం అనేది ర‌క్త సంబంధాన్ని బ‌ట్టే కాకుండా మ‌న‌సుని బ‌ట్టి కూడా ఏర్ప‌డుతుంద‌ని చెప్పే చిత్రంగా దీన్ని మ‌లిచాడు. అయితే దర్శ‌కుడు ఎక్క‌డా ఎక్కువ ఎమోష‌న‌ల్ యాంగిల్‌లో సినిమాను న‌డింపించ‌లేదు. అహ్లాదంగా న‌డిపించే ప్ర‌య‌త్నం చేశాడు. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు యాక్ష‌న్ సినిమాల‌నే చేస్తూ వ‌చ్చిన హీరో క‌ల్యాణ్ రామ్ పూర్తిస్థాయి కుటుంబ క‌థా చిత్రంలో న‌టించాడు. తన పాత్ర‌కు వంద శాతం న్యాయం చేశాడు. ఇక అత‌న్ని ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకోవాల‌నే వ్య‌క్తిగా మెహ‌రీన్ చ‌క్క‌గా న‌టించింది. ఇక న‌రేశ్‌, శ‌ర‌త్‌బాబు, ప‌విత్ర‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, రాజీవ్ క‌న‌కాల‌, విజ‌య్ కుమార్ త‌దిత‌రులు వారివారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు.
 
గోపీ సుంద‌ర్ పాట‌లు ఆక‌ట్టుకునేలా లేవు. నేప‌థ్య సంగీతం ఓకే. రాజ్‌తోట సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. ప్ర‌తి స‌న్నివేశం రిచ్‌గా, నేచుర‌ల్‌గా బావుంది. శ‌త‌మానం భ‌వ‌తి, శ్రీనివాస క‌ల్యాణం చిత్రాల్లో విల‌నిజాన్ని చూపించ‌ని ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న ఈ సినిమాలో విలనిజాన్ని కూడా యాడ్ చేశాడు. ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ బావున్నా.. దాన్ని స్లో నెరేష‌న్‌లో తెర‌కెక్కించ‌డంతో సినిమా చూసే ప్రేక్ష‌కుడికి సినిమా భారంగా న‌డుస్తున్న‌ట్లు అనిపిస్తుంది.