స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సాధించింది.బన్నికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ జతకడితే ఆ చిత్రం మరో ఆణిముత్యంగా మిగలడం పక్కా అని మరోసారి రుజువైంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు హిట్‌ సాధించాయి. కాగా ముచ్చటగా మూడో సారి జతకట్టిన ఈ ద్వయం హ్యాట్రిక్‌ సాధించి బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వేట కొనసాగిస్తోంది.ఈ చిత్రంలోని ‘సిత్తరాల సిరిపడు’ పాట ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా ఆడియోలో దాచిపెట్టిన ఈ సాంగ్‌ థియేటర్‌లో ఈలలు వేయించింది. ఈ పాటను ఫైట్‌గా తీసి గొప్ప ప్రయోగం చేశారు దర్శకుడు.ఈ ఫైట్ సీక్వెన్స్ లో వాడిన సిత్తరాల సిరపడు సాంగ్ లిరికల్ వీడియోని నేడు విడుదల చేశారు. థమన్ స్వరాలకు సూరన్న, సాకేత్ అద్బుతంగా పాడారు. అల వైకుంఠపురంలో చిత్రంలోని గత సాంగ్స్ వలే ఈ సాంగ్ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ సరసన పూజాహెగ్డే కథానాయికగా నటించారు. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ(చినబాబు) లు సంయుక్తంగా నిర్మించారు. టబు, సుశాంత్‌, నివేదా పేతురాజు, జయరాం, సముద్రఖని, సచిన్‌, సునీల్‌, నవదీప్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి వినోద్‌ సినిమాటోగ్రఫీ అందించాడు.