టైటిల్‌: డిస్కో రాజా
నటీనటులు: రవితేజ - పాయల్ రాజ్ పుత్ - నభా నటేష్ - తన్య హోప్ - బాబీ సింహా - వెన్నెల కిషోర్ - సునీల్ -  గిరిబాబు - నరేష్ - సత్య - జీవా తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: రామ్ తాళ్లూరి
రచన - దర్శకత్వం: వీఐ ఆనంద్
మాస్ మహారాజ్ రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు వి.ఐ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం డిస్కో రాజా. ఓ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్నీ ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
క‌థ‌:
వాసు(ర‌వితేజ‌) అనాథ‌. త‌న‌తో పాటు మ‌రికొంత మంది అనాథ‌ల‌ను చేర‌దీసి పెంచుతుంటాడు. వారు ఉంటున్న ఇల్లును కొనుక్కోవాల‌ని అనుకుంటారు. దాని కోసం పాతిక ల‌క్షల రూపాయ‌ల‌ను పోగు చేస్తారు. అయితే ఆ డ‌బ్బులు వేరొక‌రు దొంగలిస్తారు. ఆ డ‌బ్బును వెతుక్కుంటూ వాసు గోవా వెళ‌తాడు. అయితే వాసు ల‌డ‌క్‌లో చ‌నిపోయి మంచు గ‌డ్డ‌ల్లో కూరుకుపోతాడు. అత‌ని శ‌వాన్ని తీసుకొచ్చిన శాస్త్ర‌వేత్త ఆ శ‌వంలోని అవ‌య‌వాలు పాడు కాకుండా ఉండ‌టం చూసి ఆశ్చ‌ర్య‌పోతాడు. ప్ర‌భుత్వానికి తెలియ‌కుండా తాను చేస్తున్న ఓ ప్ర‌యోగం ద్వారా ఆ శ‌వానికి ప్రాణం పోస్తాడు. అయితే ప్రాణం వ‌చ్చిన త‌ర్వాత స‌ద‌రు వ్య‌క్తికి ఏవీ గుర్తుండ‌వు. అతని గురించి తెలిసిన కొంద‌రు వ్య‌క్తులు చంప‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తారు. అప్పుడు వారికి షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. డాక్ట‌ర్ల ప్ర‌యోగం ద్వారా ప్రాణం పోసుకుంది వాసు కాద‌ని.. 35 ఏళ్ల క్రితం చంప‌బ‌డ్డ డిస్కోరాజా అని. అస‌లు డిస్కోరాజా ఎవ‌రు? అత‌ని 35 ఏళ్ల క్రితం ఎవ‌రు చంపేస్తారు? మ‌రి వాసు ఏమ‌వుతాడు? వాసు ఎవ‌రు? డిస్కోరాజాకి, సేతుకి ఉన్న వైర‌మేంటి? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: 
‘రావణాసురిడి బాణానికి బలైన లక్ష్మణుడిని కాపాడటానికి హనుమంతుడు స​ప్త సముద్రాలు దాటి సంజీవని తీసుకొస్తాడు. అదేవిధంగా మనిషి చనిపోతే బతికించే సంజీవని కనిపెట్టడానికి వెళుతున్నాను’అనే ఓ డైలాగ్‌ ఈ చిత్రంలో ఉంటుంది. ఈ చిన్న లైన్‌ నుంచే దర్శకుడు వీఐ ఆనంద్‌ మొత్తం సినిమా కథను అల్లుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ లాంటి మాస్‌ హీరోతో ఓ విభిన్న చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్న డైరెక్టర్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. అదేవిధంగా తన శైలికి భిన్నమైన కథను ఒప్పుకొని రవితేజ గొప్ప ప్రయోగమే చేశాడు. అయితే రవితేజ విశ్వాసాన్ని ఎక్కడా వమ్ముచేయకుండా, తన కాన్సెప్ట్‌కు అభిమానులకు కావాల్సిన వినోదాన్ని.. నిర్మాతకు కావాల్సిన కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను జోడించి చాలా చక్కగా ప్రజెంట్‌ చేశాడు వీఐ ఆనంద్‌. 

టాలీవుడ్‌లో సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాలంటే కత్తిమీదసాము వంటిది. ఎందుకంటే లాజిక్‌ మిస్సయినా, ప్రేక్షకుడికి అర్థంకాకపోయినా డైరెక్టర్‌ ఫెయిల్‌ అయినట్టే. ఈ విషయంలో డైరెక్టర్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రతీ విషయాన్ని, తను చెప్పాలనుకున్న అంశాన్ని చాలా బలంగా తెరపై చూపించాడు. దీంతో ఇప్పటివరకు చిన్న చిన్న సినిమాలతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీఐ ఆనంద్‌.. ఈ సినిమాతో డైరె​క్టర్‌గా మరో మెట్టు ఎక్కనున్నాడు. 

ఇక ఈ సినిమాలో కథ కంటే ఎక్కువగా సంఘటనలే ఉంటాయి. ఆ సంఘటనలతోనే ఈ చిత్రాన్ని చాలా తెలివిగా దర్శకుడు తెరకెక్కించాడనే చెప్పాలి. అంతేకాకుండా ఇది ఎలా అవుతుంది అని సగటు ప్రేక్షకుడు ప్రశ్నించకుండా ముందే సైన్స్‌ ఫిక్షన్‌ అనే ట్యాగ్‌ జోడించారు. దీంతో కొన్ని సీన్ల గురించి ప్రశ్నించే వీలు లేదు. అయితే సైన్స్‌ ఏదైనా చేయగలుగుతుంది అని విశ్వసించి, కొన్ని లాజిక్‌ లేని సీన్లను పక్కకు పెడితే సినిమా రవితేజ స్టైల్లో అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఆయన ఫ్యాన్స్‌ ఈ సినిమాతో పండగ చేసుకోవడం ఖాయమనే చెప్పాలి. 

సినిమా ఆరంభమైన వెంటనే కథ అర్థమైనట్టు ఉంటుంది. కానీ ఏమి అర్థంకాదు. సినిమాలో లీనమైనా కొద్ది ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తాయి. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, అదేవిధంగా క్లైమాక్స్‌లో వచ్చే అతిపెద్ద ట్విస్ట్‌ సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్‌గా నిలుస్తుంది. ముగ్గురు హీరోయిన్లకు తలా కొన్ని సీన్లు పడ్డప్పటికీ రవితేజ ముందు​ అంతగా హైలెట్‌ కావు. ఇక రవితేజ అండ్‌ గ్యాంగ్‌ చేసే కామెడీ, అల్లరి ఫుల్‌ ఎంటర్‌టైన్‌గా ఉంటుంది.  

ఇక ఈ సినిమాకు ప్రధాన బలం తమన్‌ మ్యూజిక్‌. ఇప్పటికే విడుదలైన పాటలు ట్రెండ్‌ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు అందించిన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ సినిమాతో తమన్‌కు రావాల్సిన  గౌరవం తప్పక దొరుకుతుందనే చెప్పాలి. ఇక కార్తీక్‌ ఘట్టమనేని అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక ఈ సినిమా రెండు తరాల మధ్య జరుగుతుంది. కొంత సేపు గతం, మరికొంత సేపు ప్రస్తుతం జరుగుతుంటుంది. దీంతో దేనికి తగ్గట్టు ఆ సెట్స్‌ వేసి ఆ రోజుల్లోకి తీసుకెళ్లాడు ఆర్ట్‌ డైరెక్టర్‌. 

‘మన వాళ్లు కలలు నిజం చేసుకునే పనిలో ఉన్నారు. ఇక కలలపై బుక్స్‌ ఎలా రాస్తారు, కుటుంబం అంటే ఒకరిపై ఒకరు బతకడం కాదు.. ఒకరి కోసం ఒకరు బతకడం, ఏ యవ్వారం జరగకపోతే ఆ యవ్వనం యవ్వనం కాదు’ అని రచయిత అబ్బూరి రవి అందించిన డైలాగ్‌లు పర్వాలేదనిపించాయి. అయితే మాస్‌ మహారాజా స్టైల్లో మాస్‌ మసాలా డైలాగ్‌లు ఎక్కువగా లేవు. ఇక పాటలు అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగ్యశాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాక్షన్‌ ఘట్టాలు పర్వాలేదనిపించాయి. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.