నటీనటులు :  శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ, మాళవికా సతీశన్ తదితరులు.

దర్శకత్వం : శేష్ సింధూ రావ్

నిర్మాత‌లు : రాజ్ కందుకూరి

సంగీతం :  గోపీసుందర్

శివ కందుకూరి హీరోగా శేష్ సింధూ రావ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘చూసీ చూడంగానే’. వర్ష బొల్లమ్మ, మాళవికా సతీశన్ హీరోయిన్లుగా నటించగా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. రాజ్ కందుకూరి ఈ సినిమాని నిర్మించారు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

సిద్ధూ (శివ) తన మదర్ (పవిత్రా లోకేష్) కారణంగా తనకు నచ్చినట్టు ఉండలేకపోతాడు. చదువు కూడా మదర్ చెప్పిందే చదువుతూ తానూ కోరుకున్నట్టు జీవితాన్ని ప్లాన్ చేసుకోలేకపోతాడు. అలా తనకు ఇష్టం లేకుండానే బి.టెక్ లో జాయిన్ అవుతాడు. ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం కాలేజీలో ఐశ్వర్య (మాళవికా సతీశన్)తో ప్రేమలో పడతాడు. అలా నాలుగేళ్లు ప్రేమించుకున్నాక ఐశ్వర్య సిద్ధూకి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఆ తరువాత మూడేళ్లు గడిచాక సిద్ధూ చివరికి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా లైఫ్ ని లీడ్ చేస్తోన్న క్రమంలో అతని జీవితంలోకి శ్రుతి రావ్ (వర్ష బొల్లమ్మ) వస్తోంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ ఒకరికి ఒక్కరూ చెప్పుకునే ప్రొసెస్ లో సిద్ధూకి శ్రుతి గురించి ఒక నిజం తెలుస్తోంది. ఆమె కాలేజీ నుండే తనని ప్రేమిస్తోందని తెలుసుకుంటాడు. తనని ప్రేమిస్తోన్నా శ్రుతి ఆ విషయం సిద్ధూకి ఎందుకు చెప్పదు ? శ్రుతికి ఐశ్వర్యకి మధ్య రిలేషన్ ఏమిటి ? వారి మధ్య సిద్ధూకి సంబంధించి జరిగిన గొడవ ఏమిటి ?

చివరకి సిద్ధూ – శ్రుతి ఎలా ఒక్కటి అవుతారు ? ఈ మధ్యలో వారిద్దరి ప్రేమ కథలో చోటు చేసుకున్న అంశాలు ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ :

ప్రేమ కథలు ఎప్పడైనా స్ర్కీన్‌పై ఎంత బాగా ప్రజెంట్‌ చేశామనేదే ముఖ్యం. అయితే ఈ కథలో కొద్దిగా కొత్తదనం ఉన్నప్పటికీ.. నూతన దర్శకురాలు శేష సింధు దానిని తెరపై అందంగా చూపించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఫస్టాప్‌ మొత్తం సాగదీతగా అనిపిస్తోంది. సెకండాఫ్‌లో ప్రారంభంలో వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల కథతో పాటు వచ్చే కామెడీ మెప్పిస్తుంది. కానీ క్లైమాక్స్‌ మాత్రం ప్రేక్షకులను అంతంగా ఆకట్టుకునేలా అనిపించదు. మరోవైపు గోపి సుందర్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమోషనల్‌ సాంగ్స్‌లో గోపి తన మార్కు చాటుకున్నాడు. నిర్మాత రాజ్‌ కుందుకూరి నిర్మాణ విలువలు సినిమాకు భారీ లుక్‌ను తెచ్చిపెట్టింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. హీరోగా తన కుమారుడిని ప్రొజెక్టు చేయడంలో రాజ్‌ కుందుకూరి కొద్దివరకు సఫలం అయ్యాడనే చెప్పాలి.