నటీనటులు: శర్వానంద్, అక్కినేని సమంత, వెన్నెల కిషోర్, వర్ష బొల్లమ్మ, రఘుబాబు
దర్శకత్వం: సి. ప్రేమ్ కుమార్
నిర్మాతలు : దిల్ రాజు
సంగీతం : గోవింద్ వసంత
సినిమాటోగ్రఫర్ : మహేందిరన్ జయరాజు
తమిళంలో క్లాసిక్ గా నిలిచిన ‘96’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన చిత్రం ‘జాను’. శర్వానంద్.. సమంత జంటగా మాతృక దర్శకుడు ప్రేమ్ కుమారే ఈ చిత్రాన్ని కూడా రూపొందించాడు. దిల్ రాజు నిర్మించిన ‘జాను’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి తమిళంలో మాదిరే ఇక్కడా ఈ చిత్రం మ్యాజిక్ క్రియేట్ చేసిందేమో చూద్దాం.
కథ:
కె.రామచంద్ర(శర్వానంద్) ట్రావెల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తుంటాడు. ఓ పని కోసం తన స్టూడెంట్‌తో వైజాగ్ వచ్చిన రామచంద్ర అక్కడ స్కూల్, థియేటర్‌ను చూడగానే తన గత జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. అప్పుడు తనతో పాటు 10వ తరగతి చదువుకున్న మురళి(వెన్నెలకిషోర్), సతీష్(తాగుబోతు రమేశ్)లకు ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఆ క్రమంలో అందరూ హైదరాబాద్‌లో రీ యూనియన్ కావాలనుకుంటారు. అన్నట్లుగానే అందరూ కలుసుకుంటారు. అప్పుడు రామచంద్ర, జానకి దేవి(సమంత అక్కినేని)ని కలుసుకుంటాడు. దాదాపు 17 సంవత్సరాలు తర్వాత కలుసుకున్న ఇద్దరూ రీ యూనియన్ పార్టీ తర్వాత జానకితో కలిసి రామచంద్ర ఆమె ఉండే హోటల్‌కి వెళతాడు. అప్పుడు ఇద్దరూ 10వ తరగతి చదువుకునేటప్పుడు ఇద్దరి మధ్య పరిచయం, ఎలా విడిపోయాం అనే సంగతులను గుర్తుకు తెచ్చుకుంటారు. జానుకి పెళ్లై ఉంటుంది. కానీ రామచంద్ర మాత్రం పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. అసలు రామచంద్ర ఎందుకు పెళ్లి చేసుకోడు? రామచంద్ర, జాను ఎందుకు విడిపోతారు? అసలేం జరిగింది? చివరికి ఇద్దరి ప్రయాణం ఎలా ముగిసింది? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
ఓ మంచి కథకి భాషతో సంబంధం లేదని మరోసారి రుజువైంది. ‘ జాను’ సినిమాను ఓ రీమేక్‌లా కాకుండా తెలుగు నేటివిటీతో తెరకెక్కించాడు దర్శకుడు సి. ప్రేమ్ కుమార్. 96 సినిమా మ్యాజిక్ తెలుగు తెరపై కొనసాగిందని చెప్పొచ్చు. ప్రేమ కథలకు సోల్ అయిన ఎమోషన్స్ ఎక్కడా తక్కువ కాలేదు. తొలిప్రేమతో ముడిపడి ఉన్న ప్రతీ ఒక్కరి జీవితానికి ఈ సినిమా కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు మనల్ని మనం తెరపైన చూసుకుంటున్నట్లుగా ఉంటుంది. ఇద్దరి మధ్యా చోటుచేసుకునే కొన్ని సన్నివేశాలు మనసును హత్తుకునేలా ఉంటాయి. 96కు సంగీతం అందించిన గోవింద వసంత ఈ సినిమాకు కూడా పనిచేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గిలిగింతలు పెడుతుంది. మాతృకతో పోల్చినపుడు కొన్ని పాటలు కొద్దిగా దెబ్బతీశాయని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కొన్ని కామెడీ సీన్లతో నవ్వులు పూయిస్తే.. సెకండ్ హాఫ్ భగ్న ప్రేమికుల మధ్య బాధతో మన గుండెని బరువెక్కిస్తుంది. అశ్లీలతకు తావులేని ఓ బ్యూటిఫుల్ ప్రేమకథా చిత్రమ్ ‘జాను’ అని ఒక్కమాటలో చెప్పొచ్చు.