మాజీ రాష్ట్రపతి, విఖ్యాత సైంటిస్ట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ రైట్స్ తమ వద్ద ఉన్నాయని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ కలాం జీవితంపై ఏ భాషలోనైనా సినిమా లేదా డాక్యుమెంటరీని నిర్మించే, పోస్టర్లను రిలీజ్ చేసే అధికారిక హక్కులను తాము కలిగివున్నామని ఆయన స్పష్టం చేశారు. డాక్టర్ కలాంకు సంబంధించి ఏ రూపంలోనైనా రిఫరెన్సులు తీసుకొనే చర్యలకు వేరెవరు పూనుకున్నా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఈ సందర్భంగా 'డాక్టర్ అబ్దుల్ కలాం' టైటిల్‌తో తాము నిర్మించబోయే మూవీ పోస్టర్‌ను అభిషేక్ అగర్వాల్ విడుదల చేశారు. 'ఎవ్విరి స్టోరీ హ్యాజ్ ఎ హీరో' అనే ఉప శీర్షికతో డ్రీమ్ మర్చంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.