డిజిట‌ల్ రంగంలో దూసుకెళ్తోన్నహాట్ స్టార్ గ‌త ఏడాది ప్రారంభంలో స్టార్ మూవీ మేక‌ర్ నీర‌జ్ పాండేతో చేతులు క‌ల‌ప‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. వీరి కాంబినేష‌న్‌లో ‘స్పెషల్ ఓపీఎస్‌’ అనే ఓ స్పెష‌ల్ షోను రూపొందించ‌నున్నారు. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో రూపొందనున్న ఈ షో ద్వారా నీర‌జ్ పాండే డిజిట‌ల్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. గ‌డిచిన 19 ఏళ్ల వ్య‌వ‌ధిలో జాతీయ స్థాయిలో జరిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని ఈ షోను రూపొందిస్తున్నారు. అంత‌ర్జాతీయ స్పై థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ షోను ట‌ర్కీ, అజ‌ర్‌బైజాన్‌, జోర్దాన్‌, ఇండియా త‌దిత‌ర దేశాల్లో చిత్రీక‌రించ‌నున్నారు.

ఫ్రైడే స్టోరి టెల్ల‌ర్స్ బ్యాన‌ర్‌లో డిజిట‌ల్ విభాగానికి సంబంధించిన ఫ్రైడే ఫిల్మ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై నీర‌జ్ పాండే, శీత‌ల్ భాటియా ఈ షోను నిర్మిస్తున్నారు. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను  ప్ర‌ముఖ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌తో నీర‌జ్ పాండే, శివ‌మ్ నాయ‌ర్ క‌లిసి తెర‌కెక్కిస్తున్నారు. దీప‌క్ కింగార్ని, బెన‌జిర్ అలీ ఫిదాల‌తో క‌లిసి నీర‌జ్ పాండే ఈ స్పెష‌ల్ ఓపీయ‌స్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నీర‌జ్ పాండే మాట్లాడుతూ - ‘‘డిఫరెంట్ జోనర్స్‌లో కంటెంట్‌ను అందించ‌డానికి నేనెప్పుడూ ముందుంటాను. తొలిసారి డిజిట‌ల్ రంగంలోకి వ‌స్తున్నాను. అది కూడా హాట్‌స్టార్ స్పెష‌ల్‌తో క‌లిసి ప‌నిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది. గ‌త కొన్నేళ్లుగా మ‌న దేశంలో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌తో కొంద‌రు జీవితాలు ఎంత ప్ర‌భావితం అయ్యాయి. వాటిని తెర‌పై ఆవిష్క‌రించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. ఈ షోను చూసే ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా క‌థ‌తో పాటు ట్రావెల్ అవుతారు’’ అన్నారు.  

గ‌తంలో హాట్‌స్టార్ స్పెష‌ల్ అందించిన స్పెష‌ల్ షోస్ రోర్ ఆఫ్ ది ల‌య‌న్‌, క్రిమిన‌ల్ జ‌స్టిస్‌, హోస్టెజ‌స్ త‌ర‌హాలో ఈ షోను కూడా భారీగా, బోల్డ్‌గా అందించ‌నుంది.